నిమజ్జనం సందర్భంగా 18న సెలవు | Sakshi
Sakshi News home page

నిమజ్జనం సందర్భంగా 18న సెలవు

Published Tue, Sep 17 2013 1:30 AM

18th declared as holiday on ganesh idols immersion

హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు వర్తింపు
18కి బదులుగా నవంబర్ 9 రెండో శనివారం పనిదినం

హైదరాబాద్: గణేశ్ నిమజ్జనం సందర్భంగా ఈ నెల 18న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో సెలవు ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిం ది. 18వ తేదీ సెలవుకు బదులుగా నవంబర్ 9వ తేదీ రెండో శనివారాన్ని పని దినంగా ప్రకటించనుంది. ఇందుకు సంబంధించిన ఫైలును సాధారణ పరిపాలన శాఖ సోమవారం ముఖ్యమంత్రి ఆమోదానికి పంపించింది. మంగళవారం దీనిపై ఉత్తర్వులు వెలువడనున్నాయి. అక్టోబర్ నెల రెండో శనివారం దుర్గాష్టమి పండుగ కావడంతో నవంబర్ నెల రెండో శనివారాన్ని సాధారణ పరిపాలన శాఖ పనిదినంగా ప్రతిపాదించింది. 18న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కాలేజీలకు ఈ సెలవు వర్తించనుంది.
 నిమజ్జనం భద్రతపై డీజీపీ సమీక్ష
 జంటనగరాల్లో బుధవారం వినాయక నిమజ్జనం నేపథ్యంలో అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని డీజీపీ వి.దినేష్‌రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. నిమజ్జనం సందర్భంగా భద్రతాచర్యలపై పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. దిల్‌సుఖ్‌నగర్‌లో జంట పేలుళ్లకు పాల్పడిన ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాదులు యాసిన్ భత్కల్, తబ్రేజ్‌ల అరెస్టు నేపథ్యంలో విధ్వంసాలు చోటుచేసుకునే అవకాశం ఉందని కేంద్ర నిఘా వర్గాలు ఇప్పటికే హెచ్చరించాయి.  ఈ నేపథ్యంలో గణేష్ నిమజ్జనం సందర్భంగా మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని డీజీపీ ఆదేశించారు. గణేష్ మండపాల పరిసరాలలో నిఘా పెంచాలని ఆదేశించారు. సమస్యాత్మక ప్రాంతాలలో ఐపీఎస్ అధికారుల పర్యవేక్షణతోపాటు పారా మిలటరీ బలగాల మోహరించాలని నిర్ణయించారు.

Advertisement
Advertisement