మహిళా జర్నలిస్టులకూ తప్పని వేధింపులు
విశ్రాంత ఆచార్యులు పద్మజా షా
బంజారాహిల్స్: భారతదేశంలో మహిళా జర్నలిస్టులకు చట్టపరమైన బెదిరింపులు, వృత్తిపరమైన ఒంటరితనం, ఆన్‌లైన్ ట్రోలింగ్ వేధింపులు తప్పడం లేదని ఓయూ జర్నలిజం విశ్రాంత ఆచార్యులు ప్రొఫెసర్ పద్మజా షా ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రఖ్యాత పాత్రికేయులు, అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొఫెసర్ ఎస్.బషీరుద్దీన్ 90వ జయంతిని పురస్కరించుకుని వర్సిటీలో ‘జర్నలిజం– మహిళల ప్రభావం’అనే అంశంపై స్మారకోపన్యాసం చేశారు. బషీరుద్దీన్ జర్నలిజం విభాగం భవిష్యత్తును ముందుచూపుతో గమనించి అభివృద్ధిబాటలో నడిపించారని, మహిళా జర్నలిస్టులను నిపుణులుగా తీర్చిదిద్దారని కొనియాడారు. మహిళాజర్నలిస్టుల స్వతంత్ర అభిపాయాలకు అంతగా విలువ లేకుండా పాలకులు అడ్డుకుంటున్నారని విచారం వ్యక్తం చేశారు. వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో సమాజాన్ని జాగృతం చేయడంలో మీడియా ఆశించిన మేర పనిచేయడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ విజయకృష్ణారెడ్డి, మీడియా అకాడమీ మాజీ చైర్మన్ దేవులపల్లి అమర్, జర్నలిజం విభాగ అసిస్టెంట్ ప్రొఫెసర్ సునీల్‌కుమార్ పోతన తదితరులు పాల్గొన్నారు.


