అక్రిడిటేషన్ కార్డులకు దరఖాస్తుల ఆహ్వానం
అనంతగిరి: సమాచార, పౌరసంబంధాల శాఖ ఆధ్వర్యంలో 2026–28 సంవత్సరానికి జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల జారీకి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్, కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం అమల్లో ఉన్న అక్రిడిటేషన్ కార్డుల గడువు ఈ నెల 28వ తేదీతో ముగియనున్నందున అర్హత కలిగిన జర్నలిస్టులకు కొత్త అక్రిడిటేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు తెలిపారు. జిల్లా స్థాయి అక్రిడిటేషన్ కార్డుల కోసం మీడియా యాజమాన్యాలు తమ జర్నలిస్టుల పేర్ల జాబితాను జిల్లా పౌరసంబంధాల అధికారికి సమర్పించాలన్నారు. యాజమాన్యాల ద్వారా పంపిన పేర్లలో ఉన్న జర్నలిస్టులు సమాచార పౌరసంబంధాల శాఖ అధికారిక వెబ్‌సైట్‌లో సోమవారం నుంచి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
అనంతగిరి: మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనే కౌంటింగ్ సూపర్‌వైజర్లకు, అసిస్టెంట్‌లకు సోమవారం మధ్యా హ్నం 2.30 గంటలకు వికారాబాద్‌లో శిక్షణ కార్యక్రమం ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రతీక్‌జైన్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. సంబంధిత సిబ్బంది సమయానికి హాజరుకావాలని ఆయన సూచించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.
యాలాల: కాంగ్రెస్ మండల నాయకుడు, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు సిద్రాల శ్రీనివాస్ ఆదివారం బీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నాడు. మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ఇంట్లో నిర్వహించిన సమావేశంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయనకు గులాబీ కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. మండలంలో బీఆర్‌ఎస్ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఈజీఎస్ స్టేట్ కౌన్సిల్ మాజీ సభ్యుడు శివకుమార్, బీఆర్‌ఎస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లారెడ్డి, మాజీ సర్పంచ్‌లు రవికుమార్, రాములు, వెంకటయ్య, నాయకులు కృష్ణకుమార్, లాలప్ప తదితరులు ఉన్నారు.
ధారూరు: మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో సోమవారం ఉదయం 10 గంటలకు ప్రజా వేదికను నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ నర్సింహులు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. మండలంలో 2024 ఏప్రిల్ 1 నుంచి 2025 మార్చి వరకు 34 పంచాయతీల్లో చేపట్టిన ఉపాధిహామీ పనులపై చర్చ ఉంటుందన్నారు. సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు, అధికారులు, ఉపాధిహామి సిబ్బంది విధిగా హాజరు కావాలన్నారు.
హయత్‌నగర్: కార్మికులకు వ్యతిరేకంగా కేంద్రం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లను వెంటనే రద్దు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆందోజు రవింద్రాచారి డిమాండ్ చేశారు. ఈనెల 12న నిర్వహించ తలపెట్టిన సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని కోరుతూ ఆదివారం పెద్దఅంబర్‌పేట్ డివిజన్ కుంట్లూర్ రావినారాయణరెడ్డి కాలనీలో సమ్మె పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటినుంచి కార్మిక వ్యతిరేక విదానాలను అవలంబిస్తోందని, ఎన్నో పోరాటాల ఫలితంగా సాధించుకున్న కార్మిక హక్కులను కాలరాస్తోందని విమర్శించారు. కార్మిక సంఘాలు చేస్తున్న సమ్మెలో అన్ని వర్గాల ప్రజలు అధికంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు ఆజ్మీరా హరిసింగ్ నాయక్, సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు మత్యాల యాదిరెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యుడు పబ్బతి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
అక్రిడిటేషన్ కార్డులకు దరఖాస్తుల ఆహ్వానం


