Jobs In Telangana: తెలంగాణలో 65 వేల ఖాళీలు భర్తీ చేసేలా..

TS Government May Give Notification To 65 Thousand Posts - Sakshi

ముగింపు దశలో రాష్ట్రపతి నూతన ఉత్తర్వుల అమలు 

కేడర్ల వారీగా పోస్టులు, ఉద్యోగుల వివరాల సేకరణ 

నేటి నుంచి ప్రభుత్వ శాఖలతో ఆర్థిక శాఖ సమావేశాలు

త్వరలో సీఎం సమీక్షించి భర్తీపై నిర్ణయం తీసుకునే చాన్స్‌ 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలను జోన్లలోని కేడర్ల వారీగా భర్తీ చేసేందుకు కసరత్తు పూర్తయింది. అన్ని శాఖలు తమతమ పరిధిలోని ఖాళీల సంఖ్యతో సిద్ధంగా ఉన్నాయి. దాదాపు 65 వేలకు పైగా ఖాళీలున్నట్టు ఇప్పటికే ప్రభుత్వం ప్రాథమికంగా గుర్తించింది. ఈ నేపథ్యంలో 50 వేల నుంచి 65 వేల వరకు పోస్టుల భర్తీకి ఏకకాలంలో నోటిఫికేషన్లు ఇచ్చే అవకాశాలున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. స్థానికతపై రాష్ట్రపతి నూతన ఉత్తర్వుల మేరకు జిల్లా, జోనల్, మల్టీ జోనల్‌ కేడర్ల వారీగా.. మంజూరైన పోస్టులు, అందులో పనిచేస్తున్న ఉద్యోగుల విభజనకు సంబంధించిన వివరాలను నిర్దేశిత నమూనాలో అన్ని ప్రభుత్వ శాఖలు సోమవారం తమ పరిధి లోని విభాగాల నుంచి తెప్పిం చుకున్నాయి.
(చదవండి: నూటొక్క జిల్లాల.. కేటుగాడు!)

రాష్ట్ర ఆర్థిక శాఖ మంగళ, బుధ, గురువారాల్లో ఆయా ప్రభుత్వ శాఖలతో వరుసగా మూడు రోజులపాటు సమావేశాలు నిర్వహించి రాష్ట్రపతి నూతన ఉత్తర్వుల ప్రకారం ఉద్యోగుల విభజనకు తుది రూపు ఇవ్వనుంది. దీంతో పాటు ఆయా కేడర్ల వారీగా ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలను సంబంధిత శాఖల నుంచి సేకరించనుంది. ఈనెల 9తో అన్ని శాఖల్లోని కేడర్‌ల వారీగా ప్రభుత్వానికి స్పష్టమైన సమాచారం రానుంది. దానికితోడు రిక్రూట్‌మెంట్‌ ఇతరత్రా సర్వీసు నిబంధనలు తదితర అంశాలన్నింటిపై ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు అన్ని శాఖల అధికారులతో సమీక్షించనున్నారు.

ఒకేసారి 50 వేల పోస్టులకు..
శాఖల వారీగా ఖాళీ పోస్టులకు సంబంధించిన వివరాలతో రాష్ట్ర ఆర్థిక శాఖ నివేదికను సిద్ధం చేయనుంది. ఈ నెల 10 లేదా ఆ తర్వాత సీఎం కేసీఆర్‌ ఉన్నతాధికారులతో సమావేశమై ప్రత్యక్ష నియామకాల ద్వారా భర్తీ చేయాల్సిన పోస్టులకు సంబంధించిన ప్రతిపాదనలను పరిశీలించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆర్థిక శాఖ సమర్పించనున్న ప్రతిపాదనలతో ముఖ్యమంత్రి సంతృప్తి చెందితే భర్తీకి మార్గం సుగమం కానుంది.

దాదాపు ఏడు నెలల కింద సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీ మేరకు ఒకేసారి 50 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు రావాల్సి ఉంది. నవంబర్‌ చివరి వారంలో హుజూరాబాద్‌ శాసనసభ స్థానానికి ఉప ఎన్నికలు నిర్వహించే అవకాశాలుండడంతో, ఎన్నికలకు నెల రోజుల ముందే కొలువుల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం.
(చదవండి: TS: గెజిట్‌ అమలుకు గడువు పెంచండి)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top