గుడ్‌న్యూస్‌.. పిల్లలకూ టీకా రెడీ.. 15 నుంచి మార్కెట్లోకి..

Telangana Medical And Health Department Has Announced That The Zycov D Ready From Sep 15 - Sakshi

15 నుంచి మార్కెట్లోకి జైకోవ్‌–డీ సూది రహిత వ్యాక్సిన్‌

12 ఏళ్లకు పైబడిన వారందరికీ ఈ టీకా ఇవ్వొచ్చు

రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడి

56 రోజుల్లో మూడు డోసులుగా వ్యాక్సినేషన్‌

రాష్ట్రంలో 12–18 ఏళ్ల వయస్సువారు 48 లక్షల మంది

ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉచితంగా ఇచ్చే అవకాశం?

రెండేళ్లు పైబడిన పిల్లలకు నవంబర్‌లో టీకా  

సాక్షి, హైదరాబాద్‌: గుజరాత్‌కు చెందిన జైడస్‌ క్యాడిలా కంపెనీ తయారు చేసిన జైకోవ్‌–డీ కరోనా వ్యాక్సిన్‌ ఈ నెల 15వ తేదీ నుంచి మార్కెట్లోకి అందుబాటులోకి వస్తుందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. 12 ఏళ్లు పైబడిన వారందరికీ ఈ టీకా ఇవ్వొచ్చని వెల్లడించింది. ప్రస్తుతం ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇతర టీకాలను ఉచితంగా ఇస్తున్నట్లుగానే ఈ కొత్త టీకాను కూడా ఇచ్చే అవకాశముందని అధికార వర్గాలు వెల్లడించాయి. ధర విష యంలో ప్రభుత్వం ఎటువంటి ఒప్పందం చేసుకోనందున దీనిపై స్పష్టత రాలేదని అంటున్నారు. ప్రస్తుతం 18 ఏళ్లు దాటిన వారికి మాత్రమే టీకాలు వేస్తున్న సంగతి తెలిసిందే.
(చదవండి: రియా చక్రవర్తితో సంబంధమేంటి?)

ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతో ప్రయోజనకరం
ప్రస్తుతం విద్యాసంస్థలు తెరిచిన నేపథ్యంలో కొత్త టీకా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుం దని వైద్య ఆరోగ్యశాఖ భావిస్తోంది. పిల్లలను స్కూళ్లకు, కాలేజీలకు పంపడానికి చాలామంది తల్లిదండ్రులు జంకుతున్న సంగతి తెలిసిందే. కాగా కీలకమైన సమయంలో కొత్త టీకా అందు బాటులోకి వస్తోందని, దీన్ని ఏడో తరగతి నుంచి ఆపై తరగతులు చదువుతున్న వారం దరికీ వేయడానికి అవకాశం ఉందని అంటు న్నారు. నవంబర్‌ నెలలో భారత్‌ బయోటెక్‌కు చెందిన మరో టీకా అందుబాటులోకి రానుంది. దాన్ని రెండేళ్లకు పైబడిన వారం దరికీ వేయడానికి వీలుంటుందని వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. 

ప్రైవేటు ఆస్పత్రుల్లో టీకా..
జైకోవ్‌–డీ టీకా మూడు డోసులు వేసుకోవాల్సి ఉంటుంది. మొదటి డోసు వేసుకున్న 28 రోజులకు రెండో డోసు వేస్తారు. ఆ తర్వాత మరో 28 రోజులకు మూడో డోసు వేస్తారు. మొత్తంగా మూడు డోసులను 56 రోజుల్లోగా పూర్తి చేస్తారు. ప్రస్తుతం కోవాగ్జిన్, కోవిషీల్డ్‌ టీకాలు రెండు డోసులు వేస్తుండగా.. జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ వంటి కొన్ని టీకాలు ఒక డోసు వేస్తున్నారు. జైకోవ్‌–డీ టీకాను ఈ నెల 15వ తేదీ నుంచి పూర్తిస్థాయిలో వేసేలా ప్రణాళిక రచించినట్లు చెబుతున్నారు. మార్కెట్లోకి వచ్చాక ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో కొత్త టీకా వేయనున్నారు. దీని ధర ఇంకా వెల్లడి కాలేదని ఒక అధికారి తెలిపారు. రాష్ట్రంలో 12–18 ఏళ్ల వయస్సువారు 48 లక్షల మంది ఉంటారని అంచనా. వారందరికీ మూడు డోసుల టీకా వేయాలంటే కనీసం ఆరు నెలల సమయం పట్టే అవకాశముందని అంచనా వేస్తున్నారు. 
(చదవండి: డబ్బులు అడిగినందుకు ..పెట్రోల్‌ పోసి..)

ఇది ఇంట్రా డెర్మల్‌ వ్యాక్సిన్‌
జైకోవ్‌–డీ ప్రపంచంలోనే మొట్టమొదటి ప్లాస్మిడ్‌ డీఎన్‌ఏ టీకా. 12 నుండి 18 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు ఈ వ్యాక్సిన్‌ సురక్షితం అని కంపెనీ చెబుతోంది. ఇది ఇంట్రాడెర్మల్‌ వ్యాక్సిన్‌. ఫార్మాజెట్‌ అనే పరికరంతో దీన్ని చేతిపై ప్రెస్‌ చేస్తారు. దీంతో చర్మం లోపలి పొరల్లోకి వ్యాక్సిన్‌ వెళుతుంది. సూది రహిత టీకా కావడం వల్ల చేతి దగ్గర నొప్పి ఉండే అవకాశం లేదు. దీన్ని 2 నుంచి 8 డిగ్రీల సెల్సియస్‌ వద్ద నిల్వ చేయవచ్చు. 2010లో స్వైన్‌ ఫ్లూను ఎదుర్కోవటానికి వ్యాక్సిన్‌ను భారతదేశంలో జైడస్‌ క్యాడిలానే తయారు చేసింది. అలాగే గతంలో టెట్రావాలెంట్‌ కాలానుగుణ ఇన్‌ఫ్లూయెంజా టీకాను కూడా ఈ కంపెనీయే అభివృద్ధి చేసిందని వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top