ఉమ్మడి ఆదిలాబాద్‌లో పులుల సంచారం.. మ్యాన్‌ ఈటర్స్‌ కదలికలతో జనం గజగజ

Telangana: Man Eater Big Cats Threats Joint Adilabad District - Sakshi

సాక్షి, కొమరం భీమ్ ఆసిఫాబాద్: చలితో పాటు ఉమ్మడి అదిలాబాద్‌ జిల్లాను పెద్దపులి కూడా వణికిస్తోంది. పులి దాడిలో ఓ రైతు మృతి చనిపోవడంతో కలవరపాటుకి గురి చేస్తున్నాయి. పశువులపైనా దాడులు చేస్తున్నాయి. ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల జిల్లాల్లోని ఎనిమిది మండలాల ప్రజలను పులుల కదలికలు జనాలకు కంటి మీద నిద్ర లేకుండా చేస్తున్నాయి. మరోవైపు వాటిని ట్రేస్‌ చేసి పట్టుకునేందుకు అటవీ శాఖ తీవ్ర యత్నం చేస్తోంది. 

కొమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్ నగర్ టౌన్‌లో టెన్షన్‌ టెన్షన్‌ నెలకొంది. గురువారం దాదాపు పన్నెండు గంటలపాటు పులి సంచారించిందన్న ప్రచారం.. ప్రజలను భయాందోళనకు గురి చేసింది. మరోవైపు ఉదయం పూట వాకింగ్‌కు వెళ్లడంపై ఆంక్షలు విధించారు పోలీసులు. అటవీ శాఖ అధికారులతో సమన్వయం చేస్తూ పహారా కాస్తున్నారు. బయటకి రావొద్దంటూ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. గురువారం రాత్రి 10 గంటల ప్రాంతంలో చివరి సారిగా పులి జాడ తెలియగా.. టౌన్ దాటి పెద్ద వాగు గుండా అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయి ఉండవచ్చని అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు. దీంతో అటవీ సమీప గ్రామాలను అప్రమత్తం చేశారు. 

మరోవైపు ఖానాపూర్ శివారులో సిడాం భీము అనే వ్యక్తిని పులి దాడి చేసి చంపేసింది. ఆ పులే కాగజ్‌ నగర్‌లోనూ సంచరించి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఫోరెన్సిక్‌ నివేదిక.. కాలి ముద్రల ఆధారంగా పులి ఆనవాలును నిర్ధారించుకునే యత్నం చేస్తున్నారు. ఇక పులి సంచారంతో స్థానికులు భయం భయంగా గడిపారు. తలుపులు తీయడానికే జనం వణికిపోతున్నారు. 

మూడు జిల్లాలు, 8 మండలాలు, 18 గ్రామాలను‌ ఇప్పుడు మ్యాన్‌ ఈటర్స్‌ వణికిస్తున్నాయి. తొలుత మ్యాన్‌ ఈటర్స్‌ కాదని అధికారులు ప్రకటించినా.. ఖానాపూర్‌ రైతు మరణంతో ఆ భయం రెట్టింపు అయ్యింది. మరోవైపు అదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం లోకారి దారిలో పులి కలకలం రేగింది. రోడ్డు దాటుతూ వాహనదారులకు పులి కనిపించిందన్న ప్రచారంతో అక్కడా భయం నెలకొంది. మైక్‌ల ద్వారా ప్రజలను బయటకు రావొద్దని అటవీశాఖ అధికారులు ప్రచారం చేస్తున్నారు.  దహేగాం మండలం ఖర్జి గ్రామంలో పశువుల మందపై పులి పంజా విసిరినట్లు తెలుస్తోంది. భీంపూర్ , తాంసి , జైనథ్ మండలాల పరిదిలోని పెనుగంగ తీరం వెంట ఏకంగా నాలుగు పులులు సంచరిస్తున్నట్లు పలువురు చెబుతున్నారు.

తీవ్ర యత్నం
అటవీ శాఖ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతుండగా.. తమ ప్రయత్నం గురించి అధికారులు వివరిస్తున్నారు. కొమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో మొత్తం 20 మంది ప్రత్యేక అటవీశాఖ టీంతో ట్రాకింగ్ చేస్తున్నారు. 35 కెమెరాలు, 50 మంది టైగర్ ట్రాకర్స్ తో పులి సంచార ప్రాంతాల్లో అణువణువునా గాలిస్తున్నారు. ఖానాపూర్, గోవిందపూర్, చౌపన్ గూడ అటవీ ప్రాంతాలపై ప్రధానంగా దృష్టిసారించారు. 

కోల్‌బెల్ట్‌లోనూ ప్రచారం
మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌లోనూ పులి సంచారం కలకలం రేపింది. దీంతో స్థానికులు, సింగరేణి కార్మికుల్లో భయాందోళన నెలకొంది. విషయం దృష్టికి రావడంతో.. శ్రీరాంపూర్‌ పోలీసులు అప్రమత్తం అయ్యారు. పులి ఆనవాళ్లు కనిపించలేదని,  ప్రజలు భయాందోళన చెందవద్దని ప్రజలకు భరోసా ఇస్తున్నారు అటవీశాఖ అధికారులు.

ఇదీ చదవండి: దళితబంధులో ఎమ్మెల్యేల జోక్యమా? 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top