
సాక్షి, ఢిల్లీ: వివాదాస్పద హెచ్‌సీయూ కంచ గచ్చిబౌలి కేసు విచారణలో భాగంగా.. అధికారులకు సుప్రీం కోర్టు మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. అక్కడికక్కడే తాత్కాలిక జైళ్లను ఏర్పాటు చేసి అందులోకి అధికారులు పంపాల్సి ఉంటుందని భారత ప్రధాని న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ బుధవారం హెచ్చరించారు.
కంచ గచ్చిబౌలి కేసు విచారణ ఇవాళ సుప్రీం కోర్టులో జరిగింది. తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ పరీశీలనకు సమయం కావాలని ప్రతివాదులు కోరారు. దీంతో రెండు వారాల సమయం ఇస్తూ.. తదుపరి విచారణను ఆగష్టు 13కి వాయిదా వేసింది. కోర్టు..
అయితే.. ప్రస్తుతం అడవిని కాపాడారు కదా? అని చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ తెలంగాణ ప్రభుత్వం తరఫున లాయర్లను ప్రశ్నించారు. దానికి ‘‘ప్రస్తుతానికి కంచ గచ్చిబౌలి భూముల్లో అన్ని పనులు ఆపేశాం’’ అని తెలంగాణ ప్రభుత్వం తరపు న్యాయవాది బదులిచ్చారు. అభివృద్ధి కోసం అడవులను నరకడం సమంజసం కాదు. రాత్రికి రాత్రి బుల్డోజర్ పెట్టి అడవిని తీసేద్దామనుకున్నారు. సుస్థిర అభివృద్ధి కోసం నేను అడ్వొకేట్ చేస్తున్నా. అడవిని కాపాడకుంటే... అధికారులను అక్కడే టెంపరరీ జైలుకు పంపుతాం అని హెచ్చరించారాయన.