kaleshwaram: లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్న ప్రభుత్వం | Telangana Government Seeks Legal Opinion on High Court Verdict | Sakshi
Sakshi News home page

kaleshwaram: లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్న ప్రభుత్వం

Apr 22 2026 3:26 PM | Updated on Apr 22 2026 3:53 PM

Telangana Government Seeks Legal Opinion on High Court Verdict

హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకల ఆరోపణలపై విచారణ కోసం ఏర్పాటు చేసిన జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ రిపోర్టును హైకోర్టు నిలిపివేయడంతో తదుపరి ఎలా ముందుకు వెళ్లాలన్న అంశంపై ప్రభుత్వం ఆలోచిస్తోంది. హైకోర్టు తీర్పుపై తెలంగాణ ప్రభుత్వం లీగల్ ఒపీనియన్ తీసుకుంటోంది. 

ప్రభుత్వం ముందు రెండు ఆప్షన్స్ ఉన్నాయని లీగల్ టీమ్‌ చెబుతోంది. మొదటిది సుప్రీంకోర్టుకు వెళ్లడం లేదా రెండోది కొత్త కమిషన్‌ను నియమించడం. ఈ విషయంపై ఇప్పటికే సీఎం రేవంత్‌ రెడ్డితో తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చర్చించారు. 

కోర్టు తీర్పుపై రేపు కేబినెట్‌లో చర్చించనుంది రాష్ట్ర ప్రభుత్వం. కేబినెట్‌కు అడ్వకెట్ జనరల్‌ను పిలవాలని అధికారులను రేవంత్ రెడ్డి ఆదేశించారు. హైకోర్టు పూర్తి తీర్పును పరిశీలించిన తర్వాత ప్రభుత్వం తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకోనుంది. రేపటి సమావేశానికి అడ్వకేట్‌ జనరల్‌ హాజరుకానున్నారు. కేబినెట్‌ సమావేశం తర్వాత నిర్ణయం తీసుకుని ఆ మేరకు ప్రభుత్వం ముందుకు వెళ్లనుంది. 

కాగా, బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌ రావుకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించిన విషయం తెలిసిందే. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై విచారణ కోసం ఏర్పాటు చేసిన జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ రిపోర్టును హైకోర్టు నిలిపివేసింది. రిపోర్టు ఆధారంగా చర్చలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. కమిషన్‌ నిబంధనలు పాటించలేదని పేర్కొంది.  
 

Advertisement
 
Advertisement
Advertisement