ఆ బిల్లుతో ఉద్యోగులు, పేదలకు నష్టమే

Speakers at the JAC Conference of Electrical Unions - Sakshi

విద్యుత్‌ ఉద్యోగ సంఘాల జేఏసీ సదస్సులో వక్తలు

సాక్షి, హైదరాబాద్‌: విద్యుత్‌ సవరణ బిల్లు వల్ల కేవలం ఆ సంస్థలోని ఉద్యోగులే కాదు, సబ్సిడీ విద్యుత్‌పై ఆధారపడిన బడుగు, బలహీన వర్గాల వినియోగదారులు కూడా తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని తెలంగాణ విద్యుత్‌ ఉద్యోగుల జేఏసీ ఆందోళన వ్యక్తం చేసింది. ఇటు ఉద్యోగు లకు, అటు పేదలకు ప్రమాదకరంగా మారిన ఈ బిల్లును తక్షణమే ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. మొండిగా వ్యవహరించి బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెడితే, అదేరోజు దేశవ్యాప్తంగా విద్యుత్‌ ఉద్యోగులు మెరుపు సమ్మెకు దిగడానికి కూడా వెనుకాడబోరని హెచ్చరించింది. విద్యుత్‌ సవరణ బిల్లు–2021కు నిరసనగా 22 విద్యుత్‌ ఉద్యోగ సంఘాలతో ఏర్పడిన జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి సదస్సు గురువారం జరిగింది. సదస్సులో ఆల్‌ ఇండియా కిసాన్‌సభ ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి, సెంటర్‌ ఫర్‌ పవర్‌ స్టడీస్‌ కన్వీనర్‌ ఎం.వేణు గోపాల్‌రావు, జేఏసీ చైర్మన్‌ రత్నాకర్‌రావుసహా పలువురు జేఏసీ ప్రతినిధులు మాట్లాడారు. విద్యుత్‌ సంస్థలను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని డిమాండ్‌ చేశారు.

రాజ్యాంగ బాధ్యతల నుంచి తప్పుకోవడమే...
ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరించడమంటే రాజ్యాంగం అప్పగించిన బాధ్యతల నుంచి పాలకులు తప్పుకోవడమేనని వక్తలు అభిప్రాయ పడ్డారు. విద్యుత్‌ సంస్థలను ప్రైవేటువ్యక్తులకు అప్పగించిన రాష్ట్రాల్లో వినియోగదారులు తీవ్ర నష్టాలను చవిచూడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకు నేందుకు ప్రజలతో కలసి పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రపంచబ్యాంకు, కార్పొరేట్‌ కంపెనీలకు తలొగ్గే, లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగంలోని డిస్ట్రిబ్యూషన్‌ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు కుట్రపన్నారని ఆరోపించారు. సంస్కరణలు ప్రజల ఆర్థికస్థితిగతులను మెరుగుపరిచే విధంగా ఉండాలే కానీ, వారికి నష్టాలు తెచ్చిపెట్టేవిధంగా కాదని స్పష్టం చేశారు. విద్యుత్‌ సంస్థల ప్రైవేటీకరణ వల్ల జరిగే నష్టాలపై అవగాహన కల్పించి ప్రజలను కూడా ఉద్యమంలో భాగస్వాములను చేయాలని వక్తలు సూచించారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top