breaking news
power employees union
-
ఆ బిల్లుతో ఉద్యోగులు, పేదలకు నష్టమే
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ సవరణ బిల్లు వల్ల కేవలం ఆ సంస్థలోని ఉద్యోగులే కాదు, సబ్సిడీ విద్యుత్‌పై ఆధారపడిన బడుగు, బలహీన వర్గాల వినియోగదారులు కూడా తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ఆందోళన వ్యక్తం చేసింది. ఇటు ఉద్యోగు లకు, అటు పేదలకు ప్రమాదకరంగా మారిన ఈ బిల్లును తక్షణమే ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. మొండిగా వ్యవహరించి బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెడితే, అదేరోజు దేశవ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగులు మెరుపు సమ్మెకు దిగడానికి కూడా వెనుకాడబోరని హెచ్చరించింది. విద్యుత్ సవరణ బిల్లు–2021కు నిరసనగా 22 విద్యుత్ ఉద్యోగ సంఘాలతో ఏర్పడిన జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి సదస్సు గురువారం జరిగింది. సదస్సులో ఆల్ ఇండియా కిసాన్‌సభ ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి, సెంటర్ ఫర్ పవర్ స్టడీస్ కన్వీనర్ ఎం.వేణు గోపాల్‌రావు, జేఏసీ చైర్మన్ రత్నాకర్రావుసహా పలువురు జేఏసీ ప్రతినిధులు మాట్లాడారు. విద్యుత్ సంస్థలను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగ బాధ్యతల నుంచి తప్పుకోవడమే... ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరించడమంటే రాజ్యాంగం అప్పగించిన బాధ్యతల నుంచి పాలకులు తప్పుకోవడమేనని వక్తలు అభిప్రాయ పడ్డారు. విద్యుత్ సంస్థలను ప్రైవేటువ్యక్తులకు అప్పగించిన రాష్ట్రాల్లో వినియోగదారులు తీవ్ర నష్టాలను చవిచూడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకు నేందుకు ప్రజలతో కలసి పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రపంచబ్యాంకు, కార్పొరేట్ కంపెనీలకు తలొగ్గే, లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగంలోని డిస్ట్రిబ్యూషన్ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు కుట్రపన్నారని ఆరోపించారు. సంస్కరణలు ప్రజల ఆర్థికస్థితిగతులను మెరుగుపరిచే విధంగా ఉండాలే కానీ, వారికి నష్టాలు తెచ్చిపెట్టేవిధంగా కాదని స్పష్టం చేశారు. విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణ వల్ల జరిగే నష్టాలపై అవగాహన కల్పించి ప్రజలను కూడా ఉద్యమంలో భాగస్వాములను చేయాలని వక్తలు సూచించారు. -
యూనియన్ బలోపేతానికి కృషి చేద్దాం
పులివెందుల రూరల్, న్యూస్‌లైన్ :వైఎస్ఆర్ విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్ బలోపేతానికి నాయకులు, కార్మికులు కృషి చేయాలని ఆ యూనియన్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు పాండు రంగారెడ్డి పేర్కొన్నారు. సోమవారం పట్టణంలోని వైఎస్ఆర్ విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయంలో నూతన డివిజనల్ కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ యూనియన్ స్థాపించిన అనతి కాలంలో ఎంతో బలపడిందని, మరింత బలోపేతానికి కృషి చేయాలన్నారు. కార్మికుల న్యాయమైన డిమాండ్ల సాధనకు ఐక్యంగా పోరాటం చేసి సాధించాలన్నారు. కాంట్రాక్టు కార్మికులను రెగ్యులర్ చేయాలని డిమాండు చేశారు. రాష్ట్ర వైఎస్ఆర్ విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకుడు బాషా మాట్లాడుతూ కార్మికుల డిమాండ్లు పరిష్కరించడంలో యాజమాన్యం మొండివైఖరి ప్రదర్శిస్తోందన్నారు. అనంతరం 327 యూనియన్ నుంచి కొండారెడ్డి, మోహన్ రామిరెడ్డి, పెద్దన్నతోపాటు మరికొంతమంది వైఎస్ఆర్ విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్‌లో చేరారు. నూతన కార్యవర్గం ఎంపిక : పులివెందుల డివిజనల్ వైఎస్ఆర్ విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్ నూతన కార్యవర్గాన్ని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. డివిజనల్ అధ్యక్షుడుగా నాగేంద్ర ప్రసాద్, డివిజనల్ సెక్రటరీగా మంజునాథరెడ్డి, ట్రెజరర్‌గా గంగాధర, అదనపు సెక్రటరీగా బాబావల్లితో పాటు సభ్యులను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు మహేశ్వరరెడ్డి, సుధాకర్‌రెడ్డి, నాగేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.