నల్లగొండ ఎండ దేశంలో – 1, ప్రపంచంలో – 6

Nalgonda Records Highest Maximum Temperature in Country - Sakshi

దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతల నమోదులో జిల్లాది మొదటి స్థానం 

ప్రపంచవ్యాప్తంగా చూస్తే 6వ స్థానంలో.. 

రెండ్రోజుల క్రితం 43.5 డిగ్రీల సెల్సియస్‌  

గతేడాదితో పోలిస్తే ఈసారి దంచికొడుతున్న ఎండలు

సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఏటా మే నెలలో దంచికొట్టే ఎండలు ఈ ఏడాది మార్చిలోనే మండిపోతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా చూస్తే నల్లగొండ జిల్లాలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నా యి. దేశంలోనూ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న ప్రాంతాల జాబితాలో నల్లగొండ మొదటిస్థానంలో నిలువగా, ప్రపంచంలో 6వ స్థానంలో(17వ తేదీన) నిలిచింది.  

ఈసారి ముందుగానే.. 
మార్చి నెలలోనే మండుటెండలు కాస్తుండటంతో జనాలు వేసవి తాపానికి తట్టుకోలేకపోతున్నారు. మధ్యాహ్నం పూట ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రజలు ఇళ్లనుంచి బయటికొచ్చేందుకు జంకుతున్నారు. ఫలితంగా జనసంచారం లేక రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఎండ తీవ్రత తగ్గిన తర్వాతనే బయటికొస్తున్నారు. గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం ఎండల తీవ్రత ఎక్కువగానే ఉంది. గతేడాది మేలో 40 డిగ్రీల పైచిలుకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైతే ఈసారి మార్చిలోనే 43.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదై దేశంలోనే నల్లగొండ ఎండ తీవ్రతలో మొదటి స్థానంలో ఉండగా ప్రపంచంలో 6వ స్థానంలో నిలిచిందని ఎల్‌డొరాడో వెదర్‌ సంస్థ తెలిపింది. 

గతేడాదితో పోలిస్తే అధిక ఉష్ణోగ్రతలు 
గతేడాది మార్చి నెలతో పోలిస్తే ఈసారి జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రతల నమోదు భారీగా పెరిగింది. గత సంవత్సరం మార్చి 11న గరిçష్ట ఉష్ణోగ్రత 36 డిగ్రీల సెల్సియస్‌గా నమోదుకాగా, ఈనెల 11న 39 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఇలా గత సంవత్సరం మార్చి నెలంతా 38 డిగ్రీలలోపే గరిష్ట ఉష్ణోగ్రతలు ఉంటే ఈసారి ఇప్పటికే 43.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

నల్లగొండ జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రతలు ఇలా 
తేదీ    2021 మార్చి    2022 మార్చి  
11        36.0                 39.0
12       37.5                  39.5
13       38.0                  39.2
14       38.2                  40.0 
15       38.5                  41.5 
16       37.8                  42.4 
17       38.0                  43.5 
18       36.0                  40.0 
19       35.0                  39.5 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top