సీఎం వద్ద ఫైల్‌: ఎప్పుడైనా ఐపీఎస్‌ల బదిలీలు  | Sakshi
Sakshi News home page

సీఎం వద్ద ఫైల్‌: ఎప్పుడైనా ఐపీఎస్‌ల బదిలీలు 

Published Fri, Jun 18 2021 2:55 AM

IPS Transfers Nearly Will Be There In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఐపీఎస్‌ల బదిలీలకు రంగం సిద్ధ మైంది. ఇటీవల పోలీసుశాఖలో ఎస్సై నుంచి ఐపీఎస్‌ల వరకు అన్ని రకాల పదోన్నతుల ప్రక్రియ ముగిసింది. కరోనా సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ ఆంక్షలు కూడా క్రమంగా సడలిస్తుండటంతో ఐపీఎస్‌ అధికారుల బదిలీలకు చకచకా అడు గులు పడుతున్నాయని సమాచారం. బదిలీల ఫైలు ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరుకుంది. దీనిపై ఏ క్షణంలోనైనా సీఎం ఆమోదముద్ర వేసే అవకాశముంది.  మూడేళ్లగా రాష్ట్రంలో సీనియర్‌ ఐపీఎస్‌ల బదిలీలు చోటుచేసుకోలేదు. గతేడాది వేసవిలో వారి బదిలీలు చేపడుదామనుకున్నా కరోనా తొలివేవ్‌ లాక్‌డౌన్, అనంతరం దుబ్బాక ఉప ఎన్నిక, హైదరాబాద్‌లో వరదలు, జీహెచ్‌ఎంసీ ఎన్నికలు వచ్చాయి. తరువాత నాగార్జునసాగర్‌ ఉపఎన్నిక, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు, సిద్దిపేట తదితర పురపాలిలకు ఎన్నికలు రావడంతో ఐపీఎస్‌ల బదిలీలకు బ్రేకులు పడుతూ వచ్చాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఎలాంటి ఎన్నికలు లేనందున బదిలీలకు ఇదే సరైన సమయమని ప్రభుత్వం భావిస్తోంది. పైగా గతేడాది కేంద్రం 11 మంది కొత్త ఐపీఎస్‌లను కేటాయించింది. అదే సమయంలో ఇటీవల 33 మంది అడిషనల్‌ ఎస్పీలకు నాన్‌–కేడర్‌ ఐపీఎస్‌లుగా పదోన్నతులు కల్పించింది.

ఆ జిల్లాలకు పూర్తిస్థాయి ఎస్పీలు...
ఈ బదిలీల్లో పూర్తిస్థాయి ఎస్పీలు లేని నిర్మల్, ఆసిఫాబాద్‌ జిల్లాలకు ఈ కొరత తీరనుందని సమాచారం. ఒకే స్థానంలో నాలుగేళ్లుగా కొనసాగుతున్న వారిలో కొందరు బదిలీ అయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి. కొత్త కమిషనరేట్లయిన కరీంనగర్‌ (సీపీ కమలాసన్‌రెడ్డి), నిజామాబాద్‌ (సీపీ కార్తికేయ), రామగుండం (సీపీ సత్యనారాయణ)లకు ఆవిర్భావం నుంచి కమిషనర్లు మారలేదు. సిద్దిపేట కమిషనరేట్‌లోనూ సీపీ జోయల్‌ డేవిస్‌ బాధ్యతలు తీసుకుని దాదాపు మూడేళ్లు కావస్తోంది. ఇక ఇటీవల ఖమ్మంకు ఇక్బాల్‌ స్థానంలో విష్ణు వారియర్, వరంగల్‌లో సీపీగా రిటైరైన రవీందర్‌ స్థానంలో తరుణ్‌ జోషి పోలీస్‌ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. నల్లగొండ ఎస్పీ, డీఐజీ రంగనాథ్, సిరిసిల్ల ఎస్పీ రాహుల్‌ హేగ్డే సహా ఒకరిద్దరు సెంట్రల్‌ సర్వీసులో ఉన్న సీనియర్‌ ఐపీఎస్‌లకు కీలక బాధ్యతలు అప్పగిస్తారని సమాచారం. జిల్లాల్లో పనిచేస్తున్న సీనియర్లకు జీహెచ్‌ఎంసీ పరిధిలో, డీజీపీ కార్యాలయంలో కీలక బాధ్యతలు అప్పగిస్తారని తెలిసింది.

పదోన్నతులు సాధించినా పాత స్థానంలోనే.. 
2019 పార్లమెంటు ఎన్నికల తరువాత చాలా మంది ఐపీఎస్‌లకు పదోన్నతులు వచ్చినా పాత స్థానాల్లోనే ఉండిపోయారు. వారిలో 1995, 1996, 2006 బ్యాచ్‌కు చెందిన పలువురు ఐపీఎస్‌లు తమకు స్థానచలనం, పదోన్నతికి తగిన స్థానం రాలేదని అసంతృప్తిగానే ఉన్నారు. వారిలో 2006 బ్యాచ్‌కు చెందిన అధికారులు సీనియర్‌ ఎస్పీలుగా, డీఐజీలుగా రెండుసార్లు పదోన్నతులు సాధించడం గమనార్హం. 1995 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన విమెన్‌సేఫ్టీ వింగ్‌ స్వాతి లక్రా, గురుకుల కార్యదర్శి ప్రవీణ్‌ కుమార్, తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు చైర్మన్‌ శ్రీనివాసరావు, రాచకొండ సీపీ మహేశ్‌భగవత్‌లు ఐజీ నుంచి అడిషనల్‌ డైరెక్టర్‌ జనరల్‌గా పదోన్నతి సాధించారు. అయినా వారి పాత స్థానాల్లోనే కొనసాగుతున్నారు. అలాగే 1996 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన చారుసిన్హా, అనిల్‌కుమార్, వీసీ సజ్జనార్‌లు ఐజీ నుంచి అడిషనల్‌ డైరెక్టర్‌ జనరల్‌ (ఏడీజీ) అధికారులుగా పదోన్నతి సాధించారు. వారిలో అనిల్‌ కుమార్‌ హైదరాబాద్‌ కమిషనరేట్‌లో అడిషనల్‌ సీపీ (ట్రాఫిక్‌)గా, వీసీ సజ్జనార్‌ సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌గా కొనసాగుతున్నారు. ఇక 2006 బ్యాచ్‌లో విమెన్‌ సేఫ్టీ వింగ్‌ (సీఐడీ) డీఐజీ సుమతి, కార్తికేయ, శ్రీనివాసులు, పోలీస్‌ అకాడమీ జాయింట్‌ డైరెక్టర్‌ రమేశ్‌నాయుడు, శ్రీనివాసులు (సీఐడీ)తోపాటు వెంకటేశ్వర రావు కూడా పదోన్నతి సాధించారు. వారిలో వెంకటేశ్వరరావు రిటైరవగా మిగిలిన వారంతా అవే స్థానాల్లో పనిచేస్తున్నారు.   

Advertisement
Advertisement