తెలంగాణ ప్రాజెక్టులపై రేవంత్‌ నీళ్లు | Harish Rao Shocking Comments On CM Revanth Reddy | Sakshi
Sakshi News home page

తెలంగాణ ప్రాజెక్టులపై రేవంత్‌ నీళ్లు

Apr 20 2026 4:31 AM | Updated on Apr 20 2026 4:31 AM

Harish Rao Shocking Comments On CM Revanth Reddy

తానేదార్‌పల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతుల సమస్యలు తెలుసుకుంటున్న మాజీ మంత్రి హరీశ్‌రావు

గోదావరి నీటిని తరలించేందుకు ఏపీతో కుమ్మక్కు

ఢిల్లీలో సీఎం టిఫిన్‌ రాజకీయం..

రుణమాఫీ వంద శాతం పూర్తి చేసినట్టు తుమ్మల నిరూపిస్తే రాజీనామా చేస్తా: హరీశ్‌రావు  

సాక్షి ప్రతినిధి, ఖమ్మం /గుర్రంపోడు: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలంగాణ ప్రయోజనాలను పక్కనపెట్టి, ఆంధ్రప్రదేశ్‌ ప్రయోజనాలకు కొమ్ముకాస్తున్నారని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆరోపించారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన ఉమ్మడి జిల్లా స్థాయి బీఆర్‌ఎస్‌ అత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు సరికాదని నిప్పులు చెరిగారు. గోదావరి నీటిని నల్లమల సాగర్‌ పేరుతో ఆంధ్రప్రదేశ్‌ తరలించేందుకు భారీ కుట్ర జరుగుతోందని, ఇందులో రేవంత్‌రెడ్డి భాగస్వామిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. 

ఢిల్లీలో టిఫిన్‌ రాజకీయం..
ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఒక కేంద్ర మంత్రి ఇంట్లో టిఫిన్‌ చేసి వచ్చారని హరీశ్‌రావు అన్నారు. ముఖ్యమంత్రిగా ఆయన తెలంగాణ ప్రజల కోసమా, లేక పక్క రాష్ట్ర ప్రయోజనాల కోసమా అని నిలదీశారు. రైతు రుణమాఫీ వంద శాతం పూర్తయిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ‘సిద్దిపేటకు వస్తావా.. రఘునాథపాలెం నన్ను రమ్మంటావా.. రుణ మాఫీ అయిందని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా’అని హరీశ్‌రావు తుమ్మలకు సవాల్‌ విసిరారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాత మధుసూదన్, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, మెచ్చా నాగేశ్వరరావు పాల్గొన్నారు.

మొనగాడనుకుంటే మోసగాడయ్యాడు
‘రేవంత్‌రెడ్డి మాయమాటలు నమ్మిన ప్రజలు పెద్ద మొనగాడు అనుకున్నారు.. కానీ రెండున్నరేళ్ల పాలనలో పెద్ద మోసగాడని స్పష్టంగా అర్థమైందని’హరీశ్‌రావు పేర్కొన్నారు. ఆదివారం నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండలం తానేదార్‌పల్లి వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతుల సమస్యలు తెలుసు­కున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అనేక సమస్యలతో రైతులు సతమతమవుతుంటే.. సీఎం రేవంత్‌రెడ్డి ఎక్కే విమానం.. దిగే విమానం అన్నట్లు 70 సార్లు ఢిల్లీకి వెళ్లడం, కప్పం కట్టుకుని కుర్చీ కాపాడుకోవడం తప్ప ఒక్కసారి ధాన్యం కొనుగోలు కేంద్రాలు సందర్శించే సమయం ఉండటం లేదా? అని ప్రశ్నించారు.

Advertisement
 
Advertisement
Advertisement