పరిశ్రమల పేరిట 40 వేల ఎకరాలు లాక్కునేలా ప్రణాళికలు: హరీశ్‌రావు
రేవంత్‌ను మించిన రావణాసురుడు రాష్ట్రంలో మరొకరు లేరు
పరిగి నియోజకవర్గంలో భూములు కోల్పోతున్న రైతుల పరామర్శకు వెళ్లిన హరీశ్..అడ్డుకున్న పోలీసులు
శంషాబాద్ స్టేషన్‌కు తరలింపు, విడుదల
సాక్షి, హైదరాబాద్: సూర్యుడి చుట్టూ భూమి తిరిగినట్లు సీఎం రేవంత్‌రెడ్డి ఆలోచనలన్నీ పేదల భూములపైనే ఉన్నాయని బీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్, మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. దళిత, గిరిజన, బలహీనవర్గాల భూములపై గద్దల్లా వాలుతూ ఇందిరమ్మ పాలనలో ఇచ్చిన పట్టాలను లాక్కుంటున్నారని మండిపడ్డారు. వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం కాళ్లాపూర్, రాపోల్‌లో పారిశ్రామిక పార్కు మూలంగా భూములు కోల్పోతున్న రైతులను పరామర్శించేందుకు మంగళవారం కోకాపేటలోని తన నివాసం నుంచి హరీశ్ బయలుదేరి వెళ్లారు.
ఈ సందర్భంగా హరీశ్‌రావు మీడియాతో మాట్లాడుతూ పచ్చటి పొలాల్లో పరిశ్రమల పేరిట రైతుల జీవితాలతో రేవంత్ ప్రభుత్వం ఆడుకుంటోందన్నారు. రేవంత్ రాష్ట్రంలో రాక్షస పాలన సాగిస్తున్నారని, ఇది గడీల పాలన, బేడీల పాలన, నిర్బంధాల పాలన, దుర్మార్గపు పాలన అని, రైతులను పరామర్శించడానికి వెళ్తుంటే పోలీసులు అడ్డుకోవడం దారుణమన్నారు. తాము అరెస్టులు చేయమని,, తమది ప్రజాపాలన అని ఆదిలాబాద్ జిల్లా సభలో సీఎం చెప్పి 24 గంటలు కాకముందే ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులను అరెస్టు చేయడం దౌర్జన్యమన్నారు. ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఒక్కటి కూడా అమలు చేయకుండా అన్యాయంగా పేద రైతుల భూములు లాక్కునేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని, పరిశ్రమల పేరిట 40 వేల ఎకరాలు లాక్కునేలా ప్రణాళికలు చేస్తోందని హరీశ్‌రావు ఆరోపించారు.
ప్రభుత్వానికి ఎందుకంత భయం?
భూములు కోల్పోతున్న రైతులను పరామర్శించేందుకు వెళ్తుంటే ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని హరీశ్ ప్రశ్నించారు. రేవంత్ పాలనలో ఏడో గ్యారంటీగా ప్రజాస్వామ్యం ఇస్తామని చెప్పి నేడు ప్రతిపక్షాలపై ఎదురుదాడి చేస్తున్నారన్నారు. ప్రజా సమస్యలు మాట్లాడితే అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేస్తున్నారని, రాష్ట్రంలో నడుస్తున్న పోలీసు రాజ్యం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. రెండు మూడు పంటలు పండే పచ్చని భూముల్లో పరిశ్రమలు పెట్టాలనుకోవడం దారుణమని, కాళ్లాపూర్, రాపోలులో భూసేకరణ నోటిఫికేషన్ రద్దు చేసేంత వరకు పోరాటం ఆగదన్నారు. రేవంత్ పాలన అంతా బోగస్ మాటలు, బోగస్ గ్యారంటీలు. రేవంత్‌ను మించిన రావణాసురుడు రాష్ట్రంలో మరొకరు లేరన్నారు. వచ్చే ఎన్నికల్లో రేవంత్ గెలిచే పరిస్థితి లేదని, కాంగ్రెస్‌కు సింగిల్ డిజిట్ సీట్లతో ప్రతిపక్ష హోదా కూడా దక్కదన్నారు. రేవంత్ మళ్లీ గెలవడం పగటి కల అని, వచ్చేది రామరాజ్యం, కేసీఆర్ రాజ్యమేనని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు.
హరీశ్‌రావు తదితరులు అరెస్టు..విడుదల
పరిగి ఇండస్ట్రియల్ పార్క్ బాధిత రైతులను కలిసేందుకు బయల్దేరిన మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ హరీశ్ రావును నార్సింగి అప్పా జంక్షన్ వద్ద పోలీసులు అడ్డగించి అదుపులోకి తీసుకున్నారు. ఆయన వెంట బయలుదేరిన మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి తదితరులను లారీలు అడ్డుపెట్టి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అరెస్టు చేసిన నేతలను ఔటర్ రింగు రోడ్డు మీదుగా శంషాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మంగళవారం ఉదయం నుంచే హరీశ్‌రావు నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. దీంతో ఆయన నివాసానికి పెద్ద ఎత్తున చేరుకున్న బీఆర్‌ఎస్ కార్యకర్తలు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. శంషాబాద్ పోలీసు స్టేషన్ ఎదుట కూడా బీఆర్‌ఎస్ కార్యకర్తలు బైఠాయించారు. మంగళవారం మధ్యాహ్నం హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి తదితరులను పోలీసులు విడుదల చేశారు.


