బీజేపీ ‘మహిళా ఆగ్రహ యాత్ర’ | BJP Mahila Agra Yatra in protest against Congress blocking of Womens Reservation Bill | Sakshi
Sakshi News home page

బీజేపీ ‘మహిళా ఆగ్రహ యాత్ర’

Apr 24 2026 2:59 AM | Updated on Apr 24 2026 2:59 AM

BJP Mahila Agra Yatra in protest against Congress blocking of Womens Reservation Bill

కాంగ్రెస్‌ పార్టీ మహిళా బిల్లును అడ్డుకున్నందుకు నిరసనగా.. 

ఏవీ కాలేజీ నుంచి ఇందిరా పార్కు వరకు ర్యాలీ 

పాల్గొన్న కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, బీజేపీ అధ్యక్షుడు రాంచందర్‌రావు

సాక్షి, హైదరాబాద్‌: పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్‌ బిల్లును కాంగ్రెస్‌ పార్టీ అడ్డుకున్నందుకు నిరసనగా గురువారం రాష్ట్ర బీజేపీ ‘మహిళా ఆగ్రహ యాత్ర’(జన ఆక్రోష్‌ పాదయాత్ర) నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పెద్దసంఖ్యలో మహిళలు, పార్టీనాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్‌తోపాటు ’ఇండి’ కూటమి పక్షాల మహిళా వ్యతిరేక వైఖరిని నిరసిస్తూ ఈ యాత్ర సాగింది. కాంగ్రెస్‌ కొన్నేళ్లుగా మహిళా రిజర్వేషన్లను అడ్డుకుంటోందంటూ ఈ సందర్భంగా నినాదాలు చేశారు. ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు. గగన్‌మహల్‌లోని ఏవీ కాలేజీ వద్ద నుంచి పెద్దసంఖ్యలో మహిళలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు జాతీయ జెండాలు చేతబూని పాదయాత్రగా ఇందిరాపార్కుకు చేరుకున్నారు. 

ఈ పాదయాత్రలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సతీమణి కావ్యారెడ్డి, మహిళా నేతలు బంగారు శ్రుతి, బండారు విజయలక్ష్మీ, జూటూరు కీర్తిరెడ్డి, ప్రభాగౌడ్, జీహెచ్‌ఎంసీ మహిళా కార్పొరేటర్లు, బీజేపీ అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌రావు, కేంద్రమంత్రులు జి.కిషన్‌రెడ్డి, బండి సంజయ్, ఎంపీ డా.కె.లక్ష్మణ్, బీజేఎల్పినేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ మల్క కొమురయ్య ముందుండి నడిచారు. ఎంపీలు డీకే అరుణ, ఈటల రాజేందర్, ఇతర ముఖ్యనేతలు పాల్గొని మహిళా లోకానికి సంఘీభావాన్ని ప్రకటించారు. బీజేపీ మహిళా మోర్చా, బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా ఇందిరాపార్కు ధర్నాచౌక్‌ వద్ద సభ నిర్వహించారు.  

పల్లెపల్లెనా ఎండగట్టాలి: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి 
మహిళా రిజర్వేషన్ల బిల్లును కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ ఏకమై అడ్డుకోవడం ఆ పార్టీల మహిళా వ్యతిరేక వైఖరికి నిదర్శనమని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. ఈ అప్రజాస్వామిక ధోరణిని పల్లె పల్లెనా ఎండగట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాలు, మండలాలు, జిల్లాల వారీగా సర్పంచులు, వార్డు మెంబర్లు, కౌన్సిలర్లు , మహిళా సంఘాలు ఏకమై కాంగ్రెస్‌ కపట బుద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. మహిళా లోకానికి అన్యాయం చేయాలని చూసిన కాంగ్రెస్‌ నేతలు రాహుల్‌ గాం«దీ, రేవంత్‌ రెడ్డితోపాటు మిత్రపక్షాల నేతలు స్టాలిన్, అసదుద్దీన్‌ ఒవైసీ, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు.  

రేవంత్‌... మహిళాద్రోహి : బండి సంజయ్‌ 
మహిళా రిజర్వేషన్లను అడ్డుకోవడంతోపాటు వారికిచ్చి న హామీలను అమలు చేయకుండా మోసం చేసిన సీఎం రేవంత్‌ రెడ్డి ముమ్మాటికీ మహిళా ద్రోహి అని కేంద్రమంత్రి బండి సంజయ్‌ విమర్శించారు. మహిళా బిల్లును అడ్డుకున్న రేవంత్‌ను గద్దె దించాలన్నారు. రాబోయే ఎన్నికల్లోపే మహిళా రిజర్వేషన్లను అమలు చేయడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. 

ఆ పార్టీలు మహిళా వ్యతిరేక శక్తులు: రాంచందర్‌రావు 
బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ పార్టీలు మహిళా వ్యతిరేక శక్తులని బీజేపీ అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌రావు మండిపడ్డారు. రాజకీయ ఉనికి కోసం మహిళా బిల్లును అడ్డుకుంటూ.. ఈ అంశాన్ని ఉత్తర–దక్షిణ భారతాల మధ్య విభజన రాజకీయంలా మార్చడం దారుణమన్నారు. పార్లమెంటులో మహిళా బిల్లుపై కాంగ్రెస్‌ నేతలు వ్యవహరించిన తీరును చూస్తుంటే మహాభారతంలోని కౌరవుల సభ గుర్తుకు వస్తోందన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement