బేగంపేటకు ఆధునిక హంగులు | Begumpet Railway Station Development Works at Rapid Pace | Sakshi
Sakshi News home page

బేగంపేటకు ఆధునిక హంగులు

Mar 16 2025 10:01 AM | Updated on Mar 16 2025 4:41 PM

Begumpet Railway Station Development Works at Rapid Pace

సనత్‌నగర్‌: బేగంపేట రైల్వేస్టేషన్‌ సరికొత్త రూపును సంతరించుకుంది. ఆధునిక హంగులతో.. అంతర్జాతీయ ప్రమాణాలను అద్దుకుంది. ‘అమృత్‌ స్టేషన్‌’ పథకం కింద మొత్తం రూ.38 కోట్లతో బేగంపేట రైల్వేస్టేషన్‌ (begumpet railway station) అభివృద్ధి పనులను గత ఏడాది ఫిబ్రవరి 26న ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్‌గా ప్రారంభించారు. రూ.26 కోట్ల వ్యయంతో ప్రారంభమైన మొదటి ఫేజ్‌ పనులు తుది దశకు చేరుకున్నాయి. ఇప్పుడు బ్రాహ్మణవాడీ వైపు నుంచి చూస్తే ఇది బేగంపేట రైల్వేస్టేషనేనా? అనే రీతిలో కనువిందు చేసేలా ముఖద్వారాన్ని అందంగా తీర్చిదిద్దారు. 

రైల్వేస్టేషన్‌ ప్రాంగణంలోకి అడుగుపెట్టే ముందే రాష్ట్ర పక్షి పాలపిట్టల బొమ్మలు ప్రయాణికులను ఆకట్టుకుంటాయి. రైల్వేసేషన్‌ లోపలికి వెళ్లకముందే బయట ప్రకృతి అందాలతో మైమరిపించే రీతిలో తీర్చిదిద్దుతున్నారు. ప్రాంగణంలో ఉన్న రాక్‌ను అందమైన ఫౌంటెన్‌గా మలిచి పచ్చటి లాన్‌లతో ప్రకృతి ప్రేమికులు మంత్ర ముగ్ధులయ్యే విధంగా అభివృద్ధి చేస్తున్నారు.

ప్రయాణికులకు సకల వసతులు.. 
ఎస్కలేటర్లు, ర్యాంప్‌లు, లిఫ్టులు, చూడముచ్చటగా తీర్చిదిద్దిన వెయిటింగ్‌ హాల్, రైళ్ల సమాచారాన్ని ప్రయాణికులు ప్రత్యక్షంగా చూసుకునేలా వివరాల డిస్‌ప్లే, రద్దీకి అనుగుణంగా టికెట్‌ కౌంటర్ల నిర్మాణం, స్టేషన్‌లో ఏ సేవలు ఎక్కడన్న విషయాలను సులభంగా తెలుసుకునేలా ఎల్‌ఈడీ సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు. స్టేషన్‌ ప్రాంగణాన్ని ఆహ్లాదంగా తీర్చిదిద్దే పనులు కొనసాగుతున్నాయి. 

రైల్వే స్టేషన్‌ను అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా తీర్చిదిద్దారు. మొదటి ఫేజ్‌ కింద రైల్వేస్టేషన్‌కు ఒకవైపు చేపట్టిన అభివృద్ధి పనులు 95 శాతం పూర్తయ్యాయి. త్వరలో మరో 5 శాతం పనులు కూడా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురానున్నారు. ఆ తర్వాత రెండో ఫేజ్‌లో మరోవైపు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement