బతికుండగానే కాగితాల్లో చంపేశారు!

Alive Woman Shown Dead In Govt Records In Yadadri Bhuvanagiri - Sakshi

సంస్థాన్‌ నారాయణపురం: వితంతు పింఛన్‌కు దరఖాస్తున్న చేసుకున్న మహిళ బతికుండగానే అధికారులు కాగితాల్లో చంపేశారు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్‌ నారాయణపురం మండలంలో ఆలస్యంగా సోమవారం వెలుగులోకి వచ్చింది. సంస్థాన్‌ నారాయణపురం మండలం జనగాం పరిధి ఆరెగూడెం గ్రామానికి చెందిన బచ్చన బోయిన బాలమ్మ భర్త రామచంద్రం అనారోగ్య కారణాలతో 2021 జనవరి 28న మృతిచెందాడు.

దీంతో బాలమ్మ అదే ఏడాది సెప్టెంబర్‌ 14న పలు ధ్రువీకరణ పత్రాల జిరాక్స్‌ ప్రతులతో వితంతు పింఛన్‌ కోసం గ్రామ కార్యదర్శికి దరఖాస్తు చేసుకుంది. కాగా, స్వాతంత్య్ర వజ్రోత్సవాల కానుకగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నూతన పింఛన్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే బాలమ్మ తనకు పింఛన్‌ మంజూరైందా? అని అధికారులను ఆశ్రయించింది.

దీంతో వారు ఆన్‌లైన్‌లో శోధించగా ఆ జాబితాలో మాత్రం బాలమ్మ చనిపోయినట్లు ఉందని చెప్పడంతో ఆమె అవాక్కయింది. తాను బతికే ఉన్నానని, పింఛన్‌ ఇప్పించాలని బాలమ్మ అధికారులను వేడుకుంది. కాగా, దీనిపై ఎంపీడీవో యాదగిరిని సంప్రదించగా మీ–సేవలో దరఖాస్తు చేసుకోవడంలో జరిగిన పొరపాటుగా గుర్తించామని తెలిపారు. బాధితురాలికి పింఛన్‌ వచ్చేలా చూస్తామని చెప్పారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top