అవినీతి కేసులో డీఎస్పీ జగన్‌ అరెస్టు 

ACB Arrested EX DSP Of HMDA Gyara Jagan For Taking Bribe - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరానికి చెందిన కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ యజమాని నుంచి లంచం డిమాండ్‌ చేసి, కొంత మొత్తం తీసుకున్న కేసులో డీఎస్పీ గ్యార జగన్‌ను అరెస్టు చేసినట్లు ఏసీబీ అధికారులు బుధవారం ప్రకటించారు. ఈయనతో పాటు హెచ్‌ఎండీఏలో ఔట్‌ సోర్సింగ్‌ విధానంలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్న బి.రామును సైతం కటకటాల్లోకి పంపారు. కొన్ని రోజుల క్రితం వరకు హెచ్‌ఎండీఏ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం డీఎస్పీగా పని చేసిన జగన్‌ ప్రస్తుతం డీజీపీ కార్యాలయంలో వెయిటింగ్‌లో ఉన్నారు. ఈ లంచం వ్యవహారం అప్పట్లోనే చోటు చేసుకుంది.

నిజాంపేటకు చెందిన బొమ్మిన కోటేశ్వరరావు ప్రజాపతి కన్‌స్ట్రక్షన్స్‌ అండ్‌ డెవలపర్స్‌ సంస్థకు మేనేజింగ్‌ పార్టనర్‌గా ఉన్నారు. దుండిగల్‌ మున్సిపాలిటీ పరిధిలోని మల్లంపేటలో అపార్ట్‌మెంట్స్‌ నిర్మిస్తున్న ఈ సంస్థ కొన్ని ఉల్లంఘనలకు పాల్పడింది. ఆ విషయంలో చూసీ చూడనట్లు పోవడంతో పాటు సహకరించడానికి జగన్‌ రూ.4 లక్షలు లంచం డిమాండ్‌ చేశారు. అందులో రూ.2 లక్షలు అడ్వాన్స్‌గా ఇవ్వాలని కోరారు. కోటేశ్వరరావు ఈ మొత్తాన్ని జూన్‌ 11న రాము ద్వారా జగన్‌కు ఇచ్చారు. మిగిలిన మొత్తం కూడా ఇవ్వాల్సిందిగా జగన్‌ వేధిస్తుండటంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. తన వద్ద ఉన్న ఆధారాలతో పాటు జగన్, రాములతో జరిగిన ఫోన్‌ సంభాషణల వివరాలనూ అందించాడు.
చదవండి: రైళ్లలో పూజలు చేసుకోవచ్చు కానీ..

దీంతో జగన్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవాలని ఏసీబీ అధికారులు రెండు నెలల క్రితమే వలపన్నారు. ఇది కార్యాచరణలోకి వచ్చేసరికి జగన్‌ హెచ్‌ఎండీఏ నుంచి బదిలీ అయ్యారు. బాధితుడు అందించిన ఆధారాల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన ఏసీబీ అధికారులు మంగళవారం హబ్సిగూడలోని జగన్‌ ఇంటిపై దాడి చేసి అతడిని, అనంతరం సెక్యూరిటీ గార్డు రామును అరెస్టు చేశారు. వివిధ ప్రాంతాల్లో చేపట్టిన తనిఖీల్లో భారీ స్థాయిలో అక్రమాస్తులు బయటపడినట్లు సమాచారం. నిందితులను కోర్టులో హాజరుపరిచిన ఏసీబీ జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించింది.
చదవండి: గాడిద పాలకు మంచి డిమాండ్‌.. కప్పు పాల ధర ఎంతంటే..

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top