కాదల్ రీసెట్ రిపీట్ టీజర్ విడుదల
తమిళసినిమా: ప్రేమ కథా చిత్రాలు ఎప్పటికీ ఎవర్‌గ్రీనే. అలాంటి వైవిధ్యభరిత కథాంశంతో తెరకెక్కుతున్న తాజా చిత్రం కాదల్ రీసెట్ రిపీట్. విజయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మలాలి మాన్వీ మూవీ మేకర్స్, సన్ని డెన్వీ ప్రొడక్షన్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రభ ప్రేమ్‌కుమార్ సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇందులో మదుమ్‌ఘోష్, జియాశంకర్ జంటగా నటిస్తుండగా మలయాళ ప్రముఖ నటుడు అర్జున్ అశోకన్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. నటుడు ఎంఎస్.భాస్కర్, జయప్రకాశ్, విజీ చంద్రశేఖర్ తదితరులు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. హరీశ్ జయరాజ్ సంగీతాన్ని, అరవింద్ కృష్ణ ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్ర వివరాలను మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో దర్శకుడు విజయ్ తెలుపుతూ ఇది ఓ అందమైన ప్రేమ కథా చిత్రంగా ఉంటుందన్నారు. చిత్ర టైటిల్‌కు తగ్గట్టుగా కథ పలు మలుపులతో ఆసక్తికరనంగా సాగుతుందని చెప్పారు. కాగా చిత్ర టీజర్‌ను ప్రేమికుల రోజు సందర్భంగా శనివారం విడుదల చేసినట్లు చెప్పారు. ఇది ఇప్పుడు ప్రేక్షకుల మధ్య విశేష ఆదరణను పొందుతోందని చెప్పారు. ముఖ్యంగా హారీష్ జయరాజ్ సంగీతంలో రూపొందిన పాటలు సంగీత ప్రియులను అలరిస్తాయన్నారు. ఛాయాగ్రహకుడు అరవింద్ కృష్ణ సన్నివేశాల చిత్రీకరణ చిత్రానికి అదనపు ఆకర్షణగా నిలుస్తుందన్నారు. నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి అయ్యాయని, చిత్ర ట్రైలర్, ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని త్వరలోనే నిర్వహించనున్నట్లు చెప్పారు. అదేవిధంగా చిత్రాన్ని త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నట్లు దర్శకుడు విజయ్ పేర్కొన్నారు.
తమిళసినిమా: మనుషులను ఆనందతీరాలకు చేర్చేదీ, అథఃపాతాళానికి తొక్కేసేది ప్రేమ అనే రెండు అక్షరాలే. ఆ రెండు అక్షరాల్లో అంత శక్తి ఉంది. అలాంటి ప్రేమను వేడుకగా జరుపుకోవడానికే ప్రేమికుల రోజు పుట్టుకొచ్చిందని చెప్పవచ్చు. ప్రేమకు పునాది నమ్మకం. అలాంటి నమ్మకమే ప్రేమను, ప్రేమజంటను ముందుకు తీసుకెళుతుంది. ఇకపోతే ప్రేమికుల రోజును ప్రేమలో పడ్డవాళ్లు, ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్లు విరివిగా జరుపుకుంటారు. ఇందుకు సినీ తారలు అతీతం కాదు. శనివారం చాలా మంది ప్రేమజంటలు ప్రేమికుల రోజును తమ తమ ఇష్టాలకు అనుగుణంగా జరుపుకున్నారు. అలాంటి వారిలో నయనతార, విఘ్నేశ్ శివన్‌ల జంట ఒకటి. ఈ జంట ఏ విశేష రోజును వదలదు. పుట్టినరోజు, పెళ్లి రోజు, పండగల రోజులను విశేషంగా జరుపుకుంటూ ప్రచారం పొందే ప్రయత్నం చేస్తారు. తాజాగా నయనతార, విఘ్నేశ్ శివన్‌ల జంట ప్రేమికుల రోజును ప్రత్యేక ఫొటో సెషన్‌తో జరుపుకున్నారు. నిజానికి ఈ జంట బిజీగానే ఉన్నారు. విఘ్నేశ్ శివన్ తాను దర్శకత్వం వహిస్తున్న లవ్ ఇన్సూరెన్స్ కంపెని చిత్రం విడుదల పనుల్లో బిజీగా ఉన్నారు. ఇక నయనతార విషయానికి వస్తే చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఈ భామ 40 పదుల వయసులోనూ అగ్ర కథానాయకిగా రాణిస్తున్నారు. నయనతార, విఘ్నేశ్ శివన్ వివాహ జీవితం నాలుగు వసంతాలు పూర్తి చేసుకుంది. అయినప్పటికీ శనివారం ఈ సంచలన జంట ప్రేమికుల రోజును జరుపుకున్నారు. అందులో భాగంగా నయనతార, విఘ్నేశ్ శివన్ కలిసి ప్రత్యేక ఫొటో సెషన్‌ను చేయించుకున్నారు. అలా వీరిద్దరూ తీసుకున్న వివిధ భంగిమలతో కూడిన రొమాన్స్ ఫొటోలను సామాజిక మాధ్యమాలకు విడుదల చేశారు. అవి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.


