భక్తులతో పోటెత్తిన శివాలయాలు
–వాడవాడలా మహాశివరాత్రి వేడుకలు
వేలూరు: మహాశివరాత్రి పురస్కరించుకొని వేలూరు, తిరువణ్ణామలై జిల్లాల్లోని శివాలయాల్లో విశేష పూజలు నిర్వహించారు. తిరువణ్ణామలై అరుణాచలేశ్వరాలయ జాయింట్ కమిషనర్ భరణీధరన్ ఆధ్వర్యంలో ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. ఆదివారం రాత్రి ఆలయ రాజగోపురం ముందు 108 తవల నాదేశ్వరర్‌లు కచ్చేరి, నాట్యం జరిగింది. వేలాదిమంది భక్తులు గిరివలయం వచ్చి ఆలయంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. ఆదివారం ఉదయం 3 గంటలకు శివాచార్యులు స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు, పుష్పాలంకరణలు చేశారు. అనంతరం భక్తులను దర్శనార్థం అనుమతించారు. ఉదయం 6 గంటలకు స్వామి వారికి వివిద పుష్పాలంకరణలు చేసి మాడ వీధుల్లో భక్తుల దర్శనార్థం ఊరేగించారు. వేలూరు కోట మైదానంలోని జలకంఠేశ్వరాలయంలో శంఖాభిషేకం పూజలు నిర్వహించారు. వాలాజలోని ధన్వంతరి ఆరోగ్య పీఠంలో పీఠాధిపతి మురళీధర స్వామిజీ ఆధ్వర్యంలో ప్రపంచ శాంతి కోసం ప్రత్యేక యాగ పూజలు, స్వామి వారికి అభిషేకాలు జరిగాయి.
తిరుత్తణి ఆలయంలో 1,008 శంఖాభిషేకం
తిరుత్తణి: తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో ఆదివారం ఉదయం మూలవర్లకు ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించారు. అనంతరం 1,008 శంఖాలు వుంచి అలంకరించి పూజలు చేశారు. రాత్రి ఉత్సవర్లు వెండి నెమలి వాహనంలో కొలువై ఆలయ మాడ వీధుల్లో ఊరేగారు. అదేవిధంగా తిరువలంగాడు వఠారన్నేశ్వరర్ ఆలయంలో ఉదయం నుంచి రాత్రి వరకు స్వామికి నాలుగు కాల అభిషేక ప్రత్యేక పూజలు చేశారు. 13 గంటల పాటు ఆధ్యాత్మిక పాటల కచ్చేరితో పాటు నాట్యం అరంగేట్రం చేశారు.తిరుత్తణి ఆలయ అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.
ఘనంగా శివరాత్రి వేడుకలు
తిరువళ్లూరు: పట్టణంలోని బొమ్మి అమ్మవారి సమేత గురు ముత్తీశ్వరుడి ఆలయంలో శివరాత్రి వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆదివారం ఉదయం ప్రత్యేక అభిషేకంతో ప్రారంభించారు. మధ్యాహ్నం 3.30 గంటలకు మహా ప్రదోషం అభిషేకం దీపారాధన సాయంత్రం ఆరు గంటలకు ఆలయంపై నిర్మించిన 41 అడుగుల శివలింగానికి 1,008 లీటర్లు పాలతో అభిషేకం నిర్వహించారు. రాత్రి 12 గంటలకు లింగోద్భవ పూజలు నిర్వహించారు. తిరువళ్లూరులోని తీర్ధీశ్వరుడి ఆలయం, పేరంబాక్కం శోలీశ్వరుడి ఆలయం, కాశీవిశ్వనాథుడి ఆలయాల్లోనూ శివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ప్రపంచ శాంతి యాగ పూజలు చేస్తున్న వేద పండితులు, స్వామి వారికి అభిషేకం, శివలింగానికి క్రేన్ సాయంతో పాలాభిషేకం
భక్తులతో పోటెత్తిన శివాలయాలు
భక్తులతో పోటెత్తిన శివాలయాలు
భక్తులతో పోటెత్తిన శివాలయాలు


