చెరువులో నాగమ్మ విగ్రహం లభ్యం
వేలూరు: వేలూరు జిల్లా గుడియాత్తం సమీపంలోని నెల్లూరు పేటలోని చెరువులో ఐదు తలలతో కూడిన నాగమ్మ విగ్రహం లభ్యమైంది. ఆ ప్రాంత మహిళలు అధిక సంఖ్యలో అక్కడికి చేరుకొని విగ్రహానికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. నెల్లూరుపేటలోని చెరువులో అమ్మవారి విగ్రహం ఉన్నట్లు గుర్తించిన స్థానికులు రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చారు. అప్పటికే ఆ ప్రాంతంలోని మహిళలు అధిక సంఖ్యలో అక్కడకు చేరుకొని చెరువు మట్టిలో ఉన్న విగ్రహాన్ని బయటకు తీసి ఆలయ కట్టపైకి తీసుకొచ్చి ప్రత్యేక పూజలు చేశారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు అక్కడికి చేరుకొని విచారణ చేస్తున్నారు. ఇదిలాఉండగా అమ్మవారి విగ్రహం తమ ప్రాంతంలో కనిపించడంతో ఆ ప్రాంతంలోని మహిళలు అమ్మవారి ఆలయాన్ని చెరువు కట్ట వద్దనే నిర్మించేందుకు గ్రామ పెద్దలతో మాట్లాడుతున్నారు.


