ఘనంగా శివాలయాల్లో ప్రదోష పూజలు
వేలూరు : వేలూరు, తిరువణ్ణామలై జిల్లాలోని శని ప్రదోష దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. నంది భగవాన్‌కు ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పూర హారతులు పట్టారు. తిరువణ్ణామలై అరుణాచలేశ్వరాలయంలోని పెద్దనంది భగవాన్‌కు శివాచార్యులు వేద మంత్రాల నడుమ ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేసి వివిధ కాయగూరలతో ప్రత్యేక అలంకరణ చేశారు. అనంతరం శివాచార్యులు కర్పూర హారతి పట్టి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నందీశ్వరుడిని అలంకరించిన బంగారు వృషభ వాహనంలో ఉంచి ఆలయ మూడవ ప్రాకారం నుంచి మాడ వీధుల్లో భక్తుల దర్శనార్థం ఊరేగించారు. భక్తులు మాడ వీధుల్లో కర్పూర హారతులు పట్టి మొక్కులు తీర్చుకున్నారు. అదేవిధంగా వేలూరు కోట మైదానంలోని జలకంఠేశ్వరాలయంలోని నంది భగవాన్‌కు ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పూర హారతులు పట్టారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని నంది భగవాన్‌ను దర్శించుకున్నారు.


