50 మిలియన్ టన్నుల సరుకు రవాణాతో రికార్డు
కొరుక్కుపేట: చైన్నె ఓడరేవు 50 మిలియన్ టన్నుల సరుకు రవాణ ద్వారా రికార్డు సష్టించింది. వివరాలు.. చైన్నె పోర్ట్ శనివారం విడుదల చేసిన ప్రకటనలో చైన్నె ఓడరేవు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొత్తం 50 మిలియన్ టన్నుల సరుకును నిర్వహించడం ద్వారా రికార్డు సృష్టించింది. ఇది వరుసగా మూడవ సంవత్సరం వృద్ధిని సూచిస్తుందని సమాచారం. కాగా మొత్తం 50 మిలియన్ టన్నుల సరుకులో, 32.27 మిలియన్ టన్నులు కంటైనర్ షిప్‌ల ద్వారా, 13 మిలియన్ టన్నుల ముడి చమురు, 9.36 మిలియన్ టన్నుల ఎరువులు, 4.36 మిలియన్ టన్నుల వస్తు సముదాయం ఉన్నట్లు పేర్కొన్నారు.
నగలు చోరీ కేసులో
మహిళ అరెస్ట్
తిరువళ్లూరు: సర్వే పేరిట ఇంటికి వచ్చి ఒంటరిగా వున్న వృద్దురాలిపై కత్తితో దాడి చేసి నగలను అపహరించిన యువతిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా పుట్లూరు ప్రాంతానికి చెందిన శ్యామల(55) శుక్రవారం ఇంట్లో ఒంటరిగా వున్నారు. ఆ సమయంలో ఓ యువతి తాము సర్వే కోసం వచ్చామని నమ్మించింది. తర్వాత శ్యామల మెడలో వున్న గొలుసును లాక్కుకునే ప్రయత్నం చేశారు. అయితే శ్యామల అరవడంతో స్థానికులు వచ్చి యువతిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసుల విచారణలో పట్టుబడిన యువతి పవిత్రగా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన వృద్ధురాలిని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
శ్రీవారి దర్శనానికి
12గంటలు
తిరుమల: తిరుమలలో శనివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. శ్రీవారి సర్వ దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. 27 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శుక్రవారం అర్ధరాత్రి వరకు 64,222మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 24,882 భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.20కోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు.


