క్లుప్తంగా
పది రాతి విగ్రహాలు లభ్యం
తిరువళ్లూరు: విడయూరు వద్ద వున్న కుశస్థలీ నదిలో మరో పదికి పైగా రాతి విగ్రహాలు లభ్యం కావడం చర్చినీయాంశంగా మారింది. తిరువళ్లూరు జిల్లా కడంబత్తూరు యూనియన్ విడయూరులో కుశస్థలి నదికి సమీపంలో కొందరు ఉపాధి కూలీలు పనిచేస్తుండగా బ్రిడ్జి కింద పది అడుగులకుపైగా వున్న అమ్మవారి రాతి విగ్రహం కనిపించింది. వెంటనే మహిళలు కుశస్థలి నదిలో వున్న అమ్మవారి విగ్రహాన్ని బయటకు తీసి గాలించారు. ఈ సమయంలో మరో పది చిన్న రాతి విగ్రహలు సైతం లభ్యమయ్యాయి. వాటిని సైతం బయటకు తీసిన మహిళలు రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి వెళ్లిన తహసీల్దార్ బాలాజీ, రెవెన్యూ అధికారులు విగ్రహాలను స్వాధీనం చేసుకుని భద్రపరిచారు. కాగా ఇటీవలే పింజివాక్కంలోని బ్రిడ్జి వద్ద 50కి పైగా రాతి విగ్రహాలు లభ్యమైన విషయం తెలిసిందే. కాగా బ్రిడ్జిలకు సమీపంలోనే రాతి విగ్రహాలు లభ్యం కావడం చర్చినీయాంశంగా మారింది. చోరీకి గురైన విగ్రహాలను కొందరు కావాలనే నదుల్లో పడేసి వుండొచ్చన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.
దివ్యాంగుల ధర్నా
తిరువొత్తియూరు: చైన్నె, తిరువొత్తియూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట తమ డిమాండ్లు నెరవేర్చాలని ధర్నా చేసిన దివ్యాంగుల 100 మందిని పోలీసులు అరెస్టు చేశారు. తమిళనాడులోని దివ్యాంగులు, సంరక్షకుల హక్కుల సంఘం సభ్యులు దివ్యాంగులకు నెలవారీ సాయాన్ని రూ.6 వేలకు పెంచాలని, తీవ్రమైన దివ్యాంగులకు రూ. 10. వేలకు పెంచాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఉదయం తిరువొత్తియూరు తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించి నిరసన తెలిపారు. అనంతరం ఒక్కసారిగా అందరూ వల్లలార్ నెడుంచాలైలో రోడ్డు దిగ్బంధానికి దిగారు. దీంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. దీంతో ధర్నాలో పాల్గొన్న 100 మందికి పైగా దివ్యాంగులను తిరువొత్తియూరు పోలీసులు అరెస్టు చేశారు. అదేవిధంగా తమ వాహనాల్లో ధర్నాలో పాల్గొన్న దివ్యాంగులు స్వయంగా మోటార్ సైకిళ్లపై పోలీస్‌స్టేషన్‌న్‌కు వెళ్లి అరెస్టయ్యారు.
శిల్ప కళా పోటీలకు స్పందన
సాక్షి, చైన్నె: చైన్నెస్ అమృత గ్రూపు విద్యా సంస్థల ఆధ్వర్యంలో జరిగిన శిల్ప కళా పోటీలకు అనూహ్య స్పందన లభించింది. ఈ కార్యక్రమానికి చైనాకు చెందిన శిల్ప కళా నిపుణుడు, వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ చెప్స్ సొసైటీస్ సభ్యుడు యాంగ్ జిస్ క్వాస్ న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా ప్రముఖ చెఫ్ నందకుమార్ హాజరయ్యారు. ఈ పోటీలకు చైన్నె, బెంగళూరు, హైదరాబాద్, ఖైరతాబాద్, విజయవాడలోని చైన్నె అమృత విద్యా సంస్థలకు చెందిన 40 మంది శిల్పకళా విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో అర్జున్ ఎస్‌ఆర్, ఎస్‌కే పృథ్వీరాజ్, షెహనాజ్ షేక్ వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. సంస్థల చైర్మన్ ఆర్. భూమినాథన్ మాట్లాడుతూ తమ సంస్థ ప్రపంచ ప్రమాణాల శిక్షణ, అంతర్జాతీయ గుర్తింపు, వందశాతం ప్లేస్‌మెంట్ అవకాశాలను అందిస్తున్నట్టు పేర్కొన్నారు.
చేపల కోసం వల వేస్తే
శవం పడింది!
●యువతి దారుణ హత్య ఉదంతం వెలుగులోకి!
అన్నానగర్: చేపలు పట్టేందుకు వల వస్తే..ఊహించని విధంగా ఓ శవం అందులో వచ్చింది. ఓ యువతి దారుణ హత్య గురైన ఘటనను ఇది వెలుగులోకి తెచ్చింది. వివరాలు..నాగర్‌కోయిల్ సుంగాన్ కడైలోని అంబేడ్కర్ కాలనీ ప్రాంతంలో పణంగుళం అనే కొలను ఉంది. శుక్రవారం సాయంత్రం ఆ ప్రాంతానికి చెందిన యువకులు కొలనులో చేపలు పడుతుండగా, వారి వలలో ఒక పెద్ద సంచి చిక్కుకుంది. దానిని యువకులు శ్రమలకోర్చి ఒడ్డుకు తీసుకువచ్చారు. ఆ సంచి నుంచి దుర్గంధం వస్తూండడంతో అనుమానించారు. సమాచారం ఇవ్వడంతో ఇరానియల్ పోలీస్ స్టేషన్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. సంచిని తెరిస్తే...దారుణ హత్యకు గురై, కుళ్లిపోయి, గుర్తుపట్టలేని స్థితిలో ఓ యువతి మృతదేహం ఉన్నట్టు బయటపడింది. ఆ యువతి మృతదేహాన్ని తీగలతో కట్టివేసి, పెద్ద రాయి కట్టి కొలనులో పడేసినట్లు తేలింది. హత్య చేశాక నిప్పంటించినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. దాదాపు 20 ఏళ్ల వయసున్న ఆమె మృతదేహం ఉన్న స్థితి బట్టి వారం క్రితం ఆమె హత్యకు గురై ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. హతురాలు ఎవరనేది తెలియరాలేదు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న ప్రాంతంలో చాలా కాలేజీలు ఉన్నాయి. హత్యకు గురైన యువతి కాలేజీ విద్యార్థినా? ఎవరైనా విద్యార్థిని అదృశ్యమయ్యారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
క్లుప్తంగా


