ఎంజీ మెజిస్టర్ ఆవిష్కరణ
సాక్షి, చైన్నె: ఎలక్ట్రిక్ వాహన సెగ్మెంట్‌లో కొత్త ప్రయాణంగా ఎంజీ మెజిస్టిర్‌ను జేఎస్ డబ్ల్యూఎంజీ మోటారు ఇండియా ఆవిష్కరించింది. ఇది వరకటి ఈ–సెగ్మెంట్ కంటే పొడవు, ఎత్తులో, విశాల వంతమైన సౌకర్యాలతో ఈ ప్రీమియం ఎస్‌యూవీ అధునాతన హంగులతో తీర్చిదిద్దారు. ఈ మోడల్‌లో సెగ్మెంట్‌లోనే మొదటిసారి ట్రిపుల్ డిఫరెన్షియల్ లాక్‌లు (ముందు, వెనుక, మధ్య), 10 ఆఫ్–రోడ్ మోడ్‌లు అందుబాటులో ఉంచారు. ఈఎస్‌యూవీ ప్రీ బుకింగ్ అవకాశం కల్పిస్తూ శనివారం స్థానికంగా వివరాలను ఎంజీ ఇండియా ప్రకటించింది.
తాబేళ్ల అక్రమ రవాణా
అన్నానగర్ : భ్యాంకాక్ నుంచి విమానంలో చైన్నెకి అక్రమంగా తీసుకొచ్చిన తాబేళ్లు, ఇగువానాలు, ఊసరవెల్లిలు, పాములను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకాక్ నుంచి చైన్నెలోని మీనంబాక్కం అన్నా అంతర్జాతీయ విమానాశ్రయానికి శుక్రవారం ఓ విమానం చేరుకుంది. విమానంలో వచ్చిన ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. తనిఖీల్లో చైన్నెకి చెందిన యువకుడి ట్రాలీ బ్యాగ్‌లో తనిఖీ చేయగా అందులో 9 ఆఫ్రికన్ తాబేళ్లు, 4 ఇగువానాలు, 1 తూర్పు నీటి డ్రాగన్, 12 బాల్ పైథాన్‌లు, 1 అల్బినో కార్న్ స్నేక్, 3 ఊసరవెల్లిలు, 1 తెల్లటి కింగ్‌స్నేక్ ఉన్నట్టు గుర్తించారు. వీటిని స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేశారు.
టీచర్ బైక్ చోరీ
తిరువొత్తియూరు: కూరగాయలు కొనడానికి వెళ్తే తన మోటార్ సైకిల్ కొట్టేశారంటూ ఓ టీచర్ లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. వివరాలు.. తూత్తుకుడి జిల్లా సాతాన్కుళం ప్రాంతానికి చెందిన కై ్లటన్ ఓ ప్రైవేట్ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తున్నారు. గురువారం సాయంత్రం సాతానుకుళం వారపు సంతలో కూరగాయలు కొనడానికి తన బైక్‌లో వెళ్లారు. అక్కడ ఓ పెట్రోల్ బంక్ వద్ద బైక్ ఉంచి సంతకెళ్లి వచ్చి చూస్తే బైక్ కనిపించలేదు. కంగారుపడి గాలించినా ఫలితం శూన్యం. బైక్ పార్కింగ్ చేసిన చోట ఉన్న ఒక సీసీ టీవీ కెమెరాను పరిశీలిస్తే ..ఓ యువకుడు కాసేపు బైక్‌పై కూర్చుని అటూ ఇటూ తిప్పుతూ దానిని అక్కడ నుంచి తోసుకువెళ్లినట్టు ఉండడంతో చోరీకి గురైనట్లు గుర్తించాడు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ చోరీ ఘటన కాస్తా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది.


