క్లుప్తంగా
స్వచ్ఛశక్తి దిశగా గ్రీన్ ఇండియా
సాక్షి, చైన్నె: స్వచ్ఛ ఇంధన పరివర్తనను వేగవంతం చేయడం, స్వచ్ఛ శక్తి భవిష్యత్తుపై దృష్టి పెట్టే దిశగా పునరుత్పాదక ఇంధన సమీక్షలో నిర్ణయించారు. వాటర్ టుడే నేతృత్వంలో చైన్నెలోని వర్తక కేంద్రంలో పునరుత్పాదక ఇంధన ఎక్స్‌పో 2026 గురువారం ప్రారంభమైంది. ‘‘పునరుత్పాదక–మొదటి యుగానికి భారత విద్యుత్ వ్యవస్థల మార్పు’’ అనే అంశంపై ఇందులో చర్చ జరిగింది. విధాన నిర్ణేతలు, పరిశ్రమ నిపుణులు, సాంకేతిక నిపుణులు పాల్గొని గ్రిడ్ స్థిరత్వం, శక్తి నిల్వ సాంకేతికతలు, హైబ్రిడ్ విద్యుత్ వ్యవస్థలు, ఇ–మొబిలిటీ, గ్రీన్ హైడ్రోజన్ వంటి అంశాలపై చర్చించారు. స్వచ్ఛ శక్తి ప్రాజెక్టులకు పెట్టుబడులు, విధాన మద్దతు మరియు అమలు వ్యూహాలపై కూడా ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నెల 14 వరకు జరిగే ఈ ఎక్స్‌పోలో 200కు పైగా ప్రదర్శనలను ఏర్పాటు చేశారు.
12 టన్నుల రేషన్ బియ్యం స్వాధీనం
సేలం: ఈరోడ్ జిల్లాలోని శివగిరి, దాని పరిసర ప్రాంతాలలోని రైస్ మిల్లులలో అమ్మకానికి రేషన్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేస్తున్నట్లు జిల్లా పౌర సరఫరాల నేర దర్యాప్తు విభాగం పోలీసులకు రహస్య సమాచారం అందింది. దీంతో వారు శివగిరి ప్రాంతంలో ముమ్మర గస్తీ నిర్వహించారు. ఆ సమయంలో, శివగిరిలోని రంగసముద్రం ప్రాంతంలోని రామలింగానికి చెందిన తోటలో రేషన్ బియ్యాన్ని కట్టలుగా నిల్వ ఉంచారని, రామలింగం తన మోర్టన్ రైస్ మిల్లు సమీపంలోని పికప్ ట్రక్కులో రేషన్ బియ్యాన్ని కూడా నిల్వ చేసినట్లు వెల్లడైంది. నిదింతులైన రైస్ మిల్లు యజమాని రామలింగం, మేనేజర్ కడవేలు, థాంప్సన్‌ను అరెస్టు చేశారు. వారి నుండి 12,000 కిలోల రేషన్ బియ్యం, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
గూడ్స్ రైలులో మంటలు
తిరువళ్లూరు: మీంజూరు సమీపంలోని అత్తిపట్టు పుదునగర్ ప్రాంతం నుండి బొగ్గు లోడుతో వెళ్తున్న గూడ్స్ రైలు బుధవారం రాత్రి ఆంధ్రప్రదేశ్ రేణిగుంట వైపు బయలుదేరింది. మొత్తం 64 బోగీలతో గూడ్స్ రైలు అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో కడంబత్తూరు సమీపంలోని ఏకాటూరు రైల్వే స్టేషన్ దగ్గరకు వస్తుండగా, గూడ్స్ రైలులోని బొగ్గు ఉన్న 2 బోగీల నుండి ఆకస్మికంగా పొగలు వచ్చాయి. కొద్దిసేపటికే మంటలు చెలరేగాయి. ఇది చూసి దిగ్భ్రాంతి చెందిన రైలులో వున్న సిబ్బంది వెంటనే రైల్వే అధికారులకు సమాచారం అందించారు. గూడ్స్ రైలు డ్రైవర్ రైలు వేగాన్ని తగ్గించి నెమ్మదిగా కడంబత్తూరు రైల్వే స్టేషన్‌లో ఆపారు. సమాచారం అందుకున్న పెరంబాక్కం అగ్నిమాపక సిబ్బంది స్టేషన్ అధికారి ప్రసన్న ఆధ్వర్యంలో 3 గంటల పాటూ పోరాడి మంటలను పూర్తిగా ఆర్పివేశారు. దీంతో రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చిన తర్వాత గూడ్స్ రైలు గురువారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో మళ్లీ రేణిగుంట వైపు బయలుదేరింది. గూడ్స్ రైలులో మంటలు చెలరేగడంతో కడంబత్తూరు రైల్వే స్టేషన్‌లో కొద్దిసేపు కలకలం రేగింది. కాగా బొగ్గు బోగీలో మంటలు ఎలా చెలరేగాయనే దానిపై రైల్వే అధికారులు విచారణ జరుపుతున్నారు.
13 ఏళ్లుగా పరారీలో
ఉన్న నిందితుడి అరెస్టు
కొరుక్కుపేట: పట్టినపాక్కం పోలీసులు 2013లో స్థానికంగా జరిగిన ఓ కారు దొంగతనం కేసులో వేలచేరి ప్రాంతానికి చెందిన సతీష్(40) అనే రౌడీ ని అరెస్టు చేశారు. తరువాత అతను బెయిల్‌పై వి డుదలై, ఈ కేసుకు సంబంధించి సైదాపేట కోర్టు లో హాజరుకాకుండా 13 సంవత్సరాలుగా పరారీ లో ఉన్నాడు. దీని తర్వాత, సతీష్‌ను అరెస్టు చేసి మళ్లీ హాజరుపరచాలని కోర్టు పట్టినపాక్కం పోలీ సులను ఆదేశించింది. దీని తర్వాత, ఇన్‌స్పెక్టర్ వి జయకుమారి నేతత్వంలోని పోలీసులు అప్రమత్తంగా ఉండి, అనారోగ్యంతో ఉన్న తన తల్లిని చూసేందుకు వచ్చిన పరారీలో ఉన్న సతీష్‌ను అ రెస్టు చేశారు. తరువాత, అతన్ని సైదాపేట కోర్టు లో హాజరుపరిచి పుళల్ జైలుకు తరలించారు.
టైడెల్ పార్క్‌లో
యాక్సెస్ టెక్నాలజీ
సాక్షి, చైన్నె: చైన్నెలోని టైడెల్ పార్క్‌లో యాక్సెస్ టెక్నాలజీని ఏర్పాటు చేశారు. దీనిని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సుబ్రమణియన్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తమిళనాడు రాష్ట్రం వైద్య హబ్‌గానే కాకుండా పారిశ్రామిక హబ్‌గానూ అవతరించిందన్నారు. సాంకేతికత ఆధారిత శిక్షణ సాఫ్ట్‌వేర్ పరిష్కారాలపై నిబద్ధతతో పని చేస్తున్న యాక్సెస్ టెక్నాలజీ శాఖను ఇక్కడ ఏర్పాటు చేశామన్నారు. యాక్సెస్ టెక్నాలజీ వ్యవస్థాపకుడు వెంకటేశన్ మాట్లాడుతూ యాక్సెస్ టెక్నాలజీస్ 2022 నుండి ఐటీ నియామకాలలో ఉందన్నారు . తాము ఇప్పటివరకు 1800 మందికి ఉపాధి కల్పించామన్నారు. త్వరలో 3000 మందికి ఉపాధి కల్పనే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.
క్లుప్తంగా
క్లుప్తంగా


