విత్‌లవ్ సక్సెస్ ఆనందం
తమిళసినిమా: విజయం ఎవరికై నా నూతనోత్సాహాన్నిస్తుంది. అయితే దాని కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నవారికి ఆ విజయం అందితే ఆ ఆనందమే వేరు. అలాంటి సంతోషాన్ని అనుభవిస్తున్నారు సౌందర్య రజినీకాంత్. ఈమె దశాబ్దం క్రితమే నిర్మాతగా మారారు. పలు చిత్రాలను నిర్మించారు. దర్శకురాలిగానూ చిత్రాలు చేశారు. తాజాగా మహేష్ రాజ్ పసిలియన్‌తో కలిసి నిర్మించిన చిత్రం విత్‌లవ్. టూరిస్ట్ ఫ్యామిలీ చిత్రం దర్శకుడు అబిషన్ జీవింద్ కథానాయకుడిగా పరిచయం అయిన ఇందులో మలయాళ బ్యూటీ అనస్వర రాజన్ నాయకిగా నటించారు. టూరిస్ట్ ఫ్యామిలీ చిత్రానికి కో–డైరెక్టర్‌గా పని చేసిన మదన్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యారు. శ్యాన్ రోల్డన్ సంగీతాన్ని అందించిన ఈ యూత్ ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్ చిత్రం ఇటీవల తెరపైకి వచ్చి విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ఈ సందర్భంగా గురువారం మధ్యాహ్నం చిత్ర యూనిట్ చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్ థ్యాంక్స్ గివింగ్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సౌందర్య రజినీకాంత్ మాట్లాడుతూ విత్ లవ్ చిత్రం ప్రేక్షకుల మధ్య విశేష ఆదరణను పొందడంతో అమ్మానాన్నలను కలవడానికి పోయస్ గార్డెన్‌కు వెళ్లానని తెలిపారు. అక్కడ తన తల్లి హారతి పళ్లెం పెట్టుకుని నిలబడ్డారన్నారు. నాన్న ఆప్యాయంగా కౌగిలించుకుని అభినందించారని, అప్పుడు సక్సెస్ అంటే ఇలా ఉంటుందా నాన్నా అని తాను అడిగానన్నారు. ఈ చిత్రానికి తన తండ్రి రజనికాంత్ ఆశీస్సులు మొదటి నుంచి ఉన్నాయని చెప్పారు. తాను 18 ఏళ్ల నుంచి ఈ రంగంలో ఉన్నానని, తన తొలి విజయం విత్‌లవ్ చిత్రం అని పేర్కొన్నారు. ఈ చిత్ర యూనిట్ ఇప్పుడు తన కుటుంబంగా మారిందన్నారు. నిర్మాత మహేష్‌రాజ్ పసిలియన్ తన తమ్ముడు అని, ఈ చిత్ర దర్శకుడు మదన్‌తో మరో చిత్రం చేయడానికి రెడీ అని అన్నారు. అదే విధంగా ఈ చిత్ర కథానాయకుడు ఆబిషన్ జీవింద్ మాట్లాడుతూ రజినీకాంత్ సార్‌ను కలిసినప్పుడు హీరో అయ్యిపోయావ్ అంటూ అభినందించారన్నారు. సౌందర్య రజనీకాంత్, మహేష్ రాజ్ పసిలియన్ సంస్థలో మరిన్ని చిత్రాలు చేస్తానని ఆయన పేర్కొన్నారు.
విత్‌లవ్ సక్సెస్ ఆనందం


