గరుడునిపై పద్మావతమ్మ విహారం
– శాస్త్రోక్తంగా పద్మావతి అమ్మవారికి పూజలు
కొరుక్కుపేట: చైన్నె, టి.నగర్ జీఎన్ చెట్టిరోడ్డులో కొలువుదీరిన శ్రీపద్మావతి అమ్మవారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు–2026 అత్యంత వైభవంగా సాగుతున్నాయి. అందులో భాగంగా గురువారం ఉదయం శ్రీపద్మావతి అమ్మవారిని సర్వభూపాల వాహనంపై కొలువుదీర్చి ఆలయ ప్రధానార్చకులు, వైష్ణవ పండితుల మంత్రోచ్ఛారణతో మంగళవాయిద్యాల నడుమ జరిగిన ఈ వేడుకలను తిలకించేందుకు నగరం నలుమూలల నుండి భక్తులు తరలివచ్చారు. ఇదే విధంగా ఉదయం 11.30 నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఆలయంలో స్నపన తిరుమంజనం కనులపండువగా నిర్వహించారు. రాత్రి 7 గంటలకు అమ్మవారు గరుడ వాహనంపై వేంచేపు చేసి ఆలయ ప్రధాన వీధుల్లో ఊరేగారు. ఊరేగింపు పొడవునా గోవిందా గోవిందా అంటూ గోవింద నామస్మరణలతో మార్మోగింది. కాయకర్పూర హారతులు పట్టి అమ్మవారి సేవలో తరించారు. ఈ వేడుకలకు విచ్చేసిన భక్తులకు ఆలయ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ధనుంజయ్, సూపరింటెండెంట్ పుష్పలత, టీటీడీ స్థానిక సలహా మండలి మాజీ సభ్యులు ఏర్పాట్లు కల్పించారు. ఈ రెండు వాహనోత్సవాల్లో పాల్గొన్న భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు.


