నగల రికవరీ పేరిట ఆంధ్ర పోలీసుల హల్‌చల్
తిరువళ్లూరు: నగల రికవరీ పేరిట నిందితుడితో తిరువళ్లూరుకు వచ్చిన చిత్తూరు జిల్లా నగరి పోలీసులు స్థానికంగా హల్‌చల్ సృష్టించడంతో పాటూ వీడియో చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధి సెల్‌ఫోన్‌ను లాక్కుని వీడియోలను డిలీట్ చేయడం వివాదాస్పదంగా మారింది. వివరాలు.. తిరువళ్లూరు పట్టణంలోని సీవీ నాయుడు రోడ్డులో ఆరాధ్య గోల్డ్ పేరిట సంస్థను గత పది సంవత్సరాల నుంచి స్థానికులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆంధ్ర రిజిస్ట్రేషన్‌తో కూడిన రెండు వాహనాలు, తమిళనాడు రిజిస్ట్రేషన్‌తో ఒక వాహనంలో వచ్చిన డీఎస్పీ అజీజ్, నగరి ఇన్‌స్పెక్టర్ మల్లికార్జునరావుతో సహా సుమారు 10 మందికి పైగా పోలీసులు ఆరాధ్య గోల్డ్ సంస్థ వద్దకు చేరుకున్నారు. అనంతరం కారులో వున్న యువకుడిని దించి మొదటి అంతస్తులోని ఆ దుకాణానికి తీసుకెళ్లి సుమారు గంట పాటూ విచారణ చేపట్టారు. దుకాణంలోని సిబ్బంది వద్ద సైతం విచారణ చేశారు. అనంతరం కొందరు పోలీసులను అక్కడే వదిలిపెట్టి, మూడు వాహనాలో డీఎస్పీ అజీజ్, సీఐ మల్లిఖార్జునరావు పూందమల్లి వైపు వెళ్లిపోయారు.
మీడియా ప్రతినిధులతో వాగ్వాదం
విచారణ అనంతరం కిందకు దిగిన సీఐ మల్లిఖర్జునరావు వద్ద తమిళ మీడియా వివరణ కోరేందుకు యత్నించింది. అయితే ఆ సమయంలో వీడియోలు తీయెద్దు అంటూ సీఐ మల్లికార్జున్ హెచ్చరించారు. ఓ మీడియా ప్రతినిధి ఫోన్‌ను లాక్కుకుని బలవంతంగా వీడియోలను తొలగించారు. అయితే సీఐ చర్యలను మిగిలిన మీడియా ప్రతినిధులు ప్రతిఘటించారు. తమ ఫోన్‌ను లాక్కుకునే హక్కు మీకు లేదని వాగ్వాదానికి దిగారు. దీంతో సీఐ మాట్లాడుతూ నగల రికవరీ కోసం వచ్చాం. ఇక్కడ పనులు ఇంకా పూర్తి కాలేదు. అయినా ఏం చెప్పమంటారు అంటూ వెళ్లిపోయారు.
వివాదంగా మారిన వ్యవహారం
మీడియా ప్రతినిధుల సెల్‌ఫోన్ లాక్కోవడం, ఆంధ్ర పోలీసుల దురుసు ప్రవర్తనపై తిరువళ్లూరు ఇన్‌స్పెక్టర్ దామోదరన్‌కు సమాచారం అందింది. ఘటన స్థలానికి వచ్చిన ఇన్‌స్పెక్టర్ దామోదరన్ ఆంధ్ర పోలీసులపై అసహనం వ్యక్తం చేశారు. ‘మీరు దురుసుగా ప్రవర్తించడం వల్ల సమస్యలు ఎదురైతే నేనే సమాధానం చెప్పాలి. నా సర్కిల్‌లోకి వస్తే కనీసం సమాచారం ఇవ్వరా’ అంటూ ఆంధ్రా పోలీసులను నిలదీశారు. విచారణ పద్ధతిగా చేస్తే తాము సైతం సహకరిస్తామన్నారు.


