ప్రాణం తీసిన అనుమానం
అన్నానగర్: చైన్నె సమీపంలో అనుమానంతో తలెత్తిన వివాదంతో వివాహం అయిన రెండేళ్లకే మహిళా పోలీసు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన కలకలం రేపింది. చైన్నెలోని ఎగ్మోర్ పోలీసు క్వార్టర్స్‌లో నివశిస్తున్న భువనేశ్వరి(29) 2016లో తమిళనాడు పోలీసుగా చేరి ఆవడి బెటాలియన్‌లో పనిచేస్తోంది. ప్రస్తుతం ఈమె ఎగ్మోర్‌లోని క్రైమ్ బ్రాంచ్‌లో పనిచేస్తుంది. ఈమె రెండు కుటుంబాల అంగీకారంతో 2024లో సిలంబరసన్‌ను వివాహం చేసుకుంది. భువనేశ్వరి తరచుగా ఫోన్‌లో మాట్లాడుతుండడంతో భర్త సిలంబరసన్ అనుమానం పెంచుకున్నాడు. అదే సమయంలో భువనేశ్వరికి తిరువణ్ణామలైకి చెందిన స్నేహితుడు, న్యాయవాది అయిన శివమూర్తితో స్నేహం ఉండేది. ఈ స్నేహం కారణంగా భువనేశ్వరి వివాహానికి ముందు అతనికి లక్ష రూపాయలకు పైగా నగదు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఈ విషయం సిలంబరసన్‌కు తెలిసింది. దీంతో అతను ఆమెతో తరచూ గొడవ పడుతూ వచ్చాడు. ఈ స్థితిలో బుధవారం రాత్రి ఇంట్లో వంట చేస్తున్న భువనేశ్వరిని సిలంబరసన్ తాగిన మత్తులో శివమూర్తితో అనుసంధానించి అసభ్యకరంగా మాట్లాడినట్లు తెలిసింది. దీంతో మనస్తాపానికి గురైన భువనేశ్వరి, సిలంబరసన్ తాగిన మత్తులో నిద్రపోతున్న సమయంలో విద్యుత్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కొద్దిసేపట్లో మద్యం మత్తులో లేచిన సిలంబరసన్ తన భార్య ఉరి వేసుకుని ఉండడం చూసి సహాయం కోసం కేకలు వేశాడు. సమీపంలోని వ్యక్తులు ఆమెను చూడడానికి వచ్చినప్పుడు, ఆమె చనిపోయి కనిపించింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఎగ్మోర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి పంపారు. దీని తరువాత ఆత్మహత్యకు సంబంధించి కేసు నమోదు చేసి భర్త సిలంబరసన్‌ను అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అంతేకాకుండా, ఈ జంటకు వివాహం జరిగి 2 సంవత్సరాలు మాత్రమే కావడంతో ఆర్డీఓ దర్యాప్తునకు ఆదేశించారు.
ప్రాణం తీసిన అనుమానం


