ఎన్నికల సన్నాహాలు ముమ్మరం
సాక్షి, చైన్నె: తమిళనాడు, పుదుచ్చేరిలలో ఎన్నికల సన్నాహాలు ముమ్మరం అయ్యాయి. ఈ మేరకు గురువారం కేంద్ర ఎన్నికల కమిషన్ రంగంలోకి దిగింది. తొలి రోజున పుదుచ్చేరిలో అధికారులతో కేంద్ర ఎన్నికల కమిషన్ డిప్యూటీ కమిషనర్లతో కూడిన బృందం సమావేశమైంది. డిప్యూటీ ఎన్నికల కమిషనర్లు భన్వర్ ప్రకాష్, మనీష్ గార్గ్, పవన్‌కుమార్ శర్మ, సంజయ్‌కుమార్, ఆశిష్ గోయల్ తదితర ఏడుగురు సభ్యులతో కూడిన కేంద్ర ఎన్నికల కమిషన్ బృందం బుధవారం రాత్రి చైన్నెకు చేరుకుంది. వీరికి చైన్నె విమానాశ్రయంలో తమిళనాడు ఎన్నికల అధికారి అర్చన పట్నాయక్, ఇతర అధికారులు స్వాగతం పలికారు. ఇక్కడి నుంచి గురువారం పుదుచ్చేరిలో వెళ్లిన కేంద్ర అధికారుల బృందం అక్కడి ఎన్నికల అధికారులు, జిల్లాల కలెక్టర్లతో సమావేశమయ్యారు. పోలింగ్ కేంద్రాల ఏర్పాట్లు, ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు, కౌంటింగ్ కేంద్రాలు, భద్రత తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ రాష్ట్రాలు ఏ మేరకు ఎన్నికల ఏర్పాట్లు చేసి ఉన్నాయో పరిశీలిస్తున్నామని వివరించారు. ఎన్నికలకు అన్ని పనులు సిద్ధంగా ఉన్నాయని, రాష్ట్ర పరిపాలన అధికారులు, సంబంధిత అధికారులు సమన్వయంతో పని చేస్తున్నారని తెలిపారు. ఈ సమావేశాల్లో ఆదాయపు పన్ను, కస్టమ్స్, రైల్వేలు, పోలీసు, రవాణా శాఖ, అంతర్గత వ్యవహారాల విభాగం, ట్రాఫిక్ శాఖ సీనియర్ అధికారులు, జిల్లా కలెక్టర్లు, జిల్లా పోలీసు సూపరింటెండెంట్లు పాల్గొన్నారు. శుక్రవారం చైన్నెలో పర్యటించే కేంద్ర బృందం ఇక్కడి అధికారులతో సమావేశం కానున్నది.


