తిరుత్తణిలో కానుకల వెండి కరిగింపు
తిరుత్తణి: స్థానిక సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో భక్తులు కానుకలుగా చెల్లించిన రూ.30 కోట్లు విలువ చేసే టన్ను వెండిని సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి సమక్షంలో కరిగించే పనులు మంగళవారం ప్రారంభమయ్యాయి. తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామిని దర్శించుకునేందుకు ప్రతిరోజూ వేలాది మంది భక్తులు వచ్చి హుండీల్లో కానుకలు సమర్పిస్తుంటారు. భక్తులు చెల్లించిన కానుకలను ప్రతినెలా ఆలయ అధికారులు లెక్కిస్తారు. నగదును బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తారు. అయితే బంగారు, వెండి ఆభరణాలు మాత్రం కొండ ఆలయంలోని రహస్య గదిలో భద్రపరుస్తుంటారు. గత ఏడేళ్లలో భక్తులు కానుకలుగా చెల్లించిన వెండి ఆభరణాలు 1,050 కేజీలు. ఈవెండిని కరిగించాలని హిందే దేవదాయ శాఖ ఆదేశించింది. ఇందుకోసం సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి దొరస్వామిరాజ్‌ను పర్యవేక్షణ అధికారిగా నియమించింది. మంగళవారం నుంచి ఐదు రోజుల పాటు వెండి కరిగించే పనులు రిటైర్డ్ న్యాయమూర్తి దొరస్వామిరాజ్ సమక్షంలో సన్నిది వీధిలోని మయిల్ మండపం వద్ద వెండి కరిగించే పనులు చైన్నెకి చెందిన ప్రయివేటు కంపెనీ ద్వారా నిర్వహిస్తున్నారు. కరిగించిన వెండిని బిస్కెట్లుగా మార్చి బ్యాంకుల్లో డిపాజిట్ చేయనున్నట్లు ఆలయ అధికారి రమణి తెలిపారు.


