ఘనంగా 90వ వ్యవస్థాపక దినోత్సవం
సాక్షి, చైన్నె : ప్రభుత్వ రంగ బ్యాంకు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 90వ వ్యవస్థాపక దినోత్సవాన్ని చైన్నెలో ఘనంగా జరుపుకున్నారు. 1937లో బ్యాంకును స్థాపించిన వ్యవస్థాపకుడు ఎం. సిటి. ఎం. చిదంబరం చెట్టియార్ వారసత్వాన్ని స్మరించుకుంటూ ఈ వేడుకలో సేవా కార్యక్రమాలు జరిగాయి. ఆయన విగ్రహానికి ఐఓబీ ఎండీ అజయ్ కుమార్ శ్రీవాస్తవ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు జోయ్‌దీప్ దత్తా రాయ్, దనరాజ్ టి, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ రాజీవ్ కుమార్ తదితరులు పూల మాలలు వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో సీనియర్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్‌లు , సెంట్రల్ ఆఫీస్ సిబ్బంది కూడా భాగమయ్యారు. ఈసందర్భంగా చైన్నెలోని 43 పాఠశాలల్లో 7,584 మంది విద్యార్థులకు అక్షయ పాత్ర ఫౌండేషన్ ద్వారా అల్పాహారం అందజేశారు. చైన్నెలో ఐదు ప్రధాన ప్రాంతాల్లో పారిశుధ్యం , పరిశుభ్రత కిట్లు పంపిణీ చేసి, 4,000 బాలికలు ,10,000 గృహాలకు ప్రయోజనం కల్పించారు. ఇనిషియేటివ్ ఫర్ సోషల్ డెవలప్‌మెంట్ అండ్ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ సొసైటీ సహకారంతో ఈ కార్యక్రమాన్ని అమలు చేశారు. స్వామి వివేకానంద సేవాలయ – సామాజిక అభివృద్ధి ట్రస్ట్ ద్వారా 23 మంది పేద వికలాంగులకు వీల్‌చైర్లు , ట్రైసైకిళ్లను అందజేశారు. 90వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు విద్య, ఆరోగ్యం, పరిశుభ్రత సామాజిక సేవలలో బ్యాంక్ నిబద్ధతను చాటినట్టు అజయ్‌కుమార్ శ్రీవాస్తవ తెలిపారు.


