ఢిల్లీకి వెళ్లాల్సిన విమానంలో సాంకేతిక లోపం
●సకాలంలో పైలెట్ గుర్తించడంతో తప్పిన ప్రమాదం
తిరువొత్తియూరు: చైన్నె విమానాశ్రయం టెర్మినల్ 4 నుండి ఎయిర్ ఇండియా ఫ్యాసింజర్ విమానం మంగళవారం ఉదయం 6 గంటలకు ఢిల్లీకి బయలుదేరడానికి సిద్దంగా ఉంది. విమానంలో 165 మంది ప్రయాణికులు, ఆరుగురు విమాన సిబ్బందితో సహా 171 మంది ఉన్నారు. కాగా బయలుదేరే ముందు విమానం ఇంజిన్‌లను పైలట్ తనిఖీ చేశారు. ఆ సమయంలో ఇంజిన్ సాంకేతిక లోపం ఉన్నట్లు పైలట్లు గుర్తించారు. వెంటనే చైన్నె విమానశ్రయ నియంత్రణ గదికి సమాచారం అందించారు. దీంతో విమానం ఆలస్యంగా బయలుదేరుతుందని ప్రకటించారు. ఆ విమానంలో వున్న ఎంపీ కతిర్ ఆనంద్, పార్లమెంట్ సమావేశంలో పాల్గొనడానికి అత్యవసరంగా ఢిల్లీకి వెళ్లవలసి వుందని ఎయిర్ ఇండియా అధికారులకు తెలిపారు. వెంటనే అయన్ని మాత్రమే ఉదయం 6.55 గంటలకు ఢిల్లీకి వెళ్లే మరో ఎయిర్ ఇండియా విమానంలో పంపారు. మిగిలిన 164 మంది ప్రయాణికులను చైన్నె విమానాశ్రయం లాంజ్‌లో ఉంచారు. విమానంలో ఏర్పడిన సాంకేతిక లోపంను సరిచేయడానికి విమానం ఇంజినీర్ల బృందం యత్నించింది. దీంతో ఉదయం 10.15 గంటలకు మరమ్మతులు చేసిన తర్వాత ఢిల్లీకి బయలుదేరింది. కాగా ఇంజిన్ లోపాన్ని పైలట్ సరైన సమయంలో గుర్తించడంతో అందరూ అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డారు.
కేళంబాక్కం సమీపంలో దారుణం
తిరువొత్తియూరు: శివగంగై జిల్లా దేవకోట్టై ప్రాంతానికి చెందిన ఆంధోని(42) ఓ ప్రైవేట్ తారు తయారీ సంస్థలో లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. మంగళవారం ఉదయం అతను ఇటుక బట్టీ పక్క ఉన్న వెణ్బాక్కం నుండి తారు లారీని నడుపుకుంటూ పాత మామల్లపురం రోడ్డు కేళంబాక్కం మీదుగా షోళింగనల్లూరు వైపు బయలుదేరాడు. వాణియంచావడి వద్ద రోడ్డుకు అడ్డంగా ఉన్న విద్యుత్ తీగ తారు లారీకి తగిలినట్లు తెలుస్తోంది. దీంతో విద్యుత్ షాక్ తగిలి లారీలో మంటలు చెలరేగాయి. అందులో చిక్కుకున్న డ్రైవర్ ఆంధోని బయటకు రాలేక ఘటన స్థలంలోనే శరీరం కాలిపోయి దారుణంగా మృతి చెందారు. తారు లారీ పూర్తిగా కాలిపోవడంతో మంటలు చెలరేగి ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం రేగింది. సమాచారం అందుకున్న చిరుచేరి అగ్ని మాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. దీని కారణంగా ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిపివేశారు. మంటలు పూర్తిగా చల్లారిన తర్వాత , లారీలో ఉన్న ఆంధోని మృతదేహాన్ని వెలికితీశారు. ఆనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చెంగల్‌పట్టు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
చైన్నె సూపర్ కింగ్‌తో బాన్‌బ్లాక్ ఒప్పందం
సాక్షి,చైన్నె : ప్రపంచ ఏఐ అండ్ టెక్నాలజీ సొల్యూషన్స్ కంపెనీ అయిన బాన్ బ్లాక్ సంస్థ చైన్నె సూపర్ కింగ్స్(సిఎస్‌కె)తో ఒప్పందం చేసుకుంది. సిఎస్‌కె అధికారిక ఆర్టిఫిషియల్ ఇంటెలియన్స్ (ఏఐ) భాగస్వామిగా సేవలను అందించనుంది. ఈ మేరకు నగరంలో జరిగిన సీఎస్‌కే మేనేజింగ్ డైరెక్టర్ కేఎస్ విశ్వనాథన్, బాన్ బ్లాక్ సహ వ్యవస్థాపకులు, మేనేజింగ్ డైరెక్టర్ దురై అప్పాదురై మాట్లాడుతూ, సీఎస్‌కేతో భాగస్వామ్యం చాలా సంతోషంగా ఉందని , ఈ భాగస్వామ్యం చేయడం వల్ల తెలివైన సాంకేతికతతో క్రీడలను ఎలా ఉన్నతీకరించగలవో ప్రదర్శించడం బాన్‌బ్లాక్ లక్ష్యమని, ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది క్రికెట్ అభిమానులకు వినోదం అనుభవాలను సృష్టించటంపై దృష్టి పెట్టనున్నట్టు దురై అప్పాదురై పేర్కొన్నారు. అనంతరం కెఎస్ విశ్వనాథన్ మాట్లాడుతూ బాన్ బ్లాక్‌తో ఒప్పందంతో క్రికెట్‌లో ఏఐ సాంకేతికతను వినియోగించటం ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో భాగంగా ఈ సీజన్ కు సంబంధించిన జెర్సీను ఘనంగా ఆవిష్కరించారు.
శ్రీవారి దర్శనానికి 12 గంటలు
తిరుమల: తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ మోస్తరుగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 21 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సోమవారం అర్ధరాత్రి వరకు 74,130 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 24,631 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.03 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 12 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టంచేసింది.


