అసంతృప్తిలో టీఎన్‌సీసీ | - | Sakshi
Sakshi News home page

అసంతృప్తిలో టీఎన్‌సీసీ

Feb 11 2026 7:40 AM | Updated on Feb 11 2026 7:40 AM

అసంతృప్తిలో టీఎన్‌సీసీ

అసంతృప్తిలో టీఎన్‌సీసీ

● డీఎంకే జాప్యంపై ఢిల్లీలో పెదవి విప్పిన నేతలు

సాక్షి, చైన్నె: సీట్ల పందేరాన్ని డీఎంకే నాన్చుడు ధోరణితో అనుసరించడాన్ని టీఎన్‌సీసీ నేతలు తీవ్రంగా పరిగణించారు. ఢిల్లీ వేదికగా తమ గళాన్ని మంగళవారం వినిపించారు. డీఎంకే కూటమిలో కాంగ్రెస్‌ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే, కాంగ్రెస్‌లోని కొందరు ఏఐసీసీ నేతలు, టీఎన్‌సీసీకి చెందిన మరి కొందరు నేతలు చేస్తున్న వ్యాఖ్యలతో కూటమిలో కొత్త చిక్కులు మొదలయ్యాయి. టీవీకే అధినేత విజయ్‌కు అనుకూలంగా ఈ వ్యాఖ్యలు ఉండడాన్ని డీఎంకే తీవ్రంగా పరిగణించింది. దీంతో పార్టీ పార్లమెంటరీ నేత, డిప్యూటీ ప్రధాన కార్యదర్శి కనిమొళి రంగంలోకి దిగారు. గత నెల ఆమె ఢిల్లీలో ఏఐసీసీ నేత రాహుల్‌గాంధీతో గంటన్నరపాటు సమావేశమయ్యారు. ఈ భేటీ తర్వాత డీఎంకే కూటమిలో కాంగ్రెస్‌ కొనసాగుతున్నట్టు సమాచారం వెలువడింది. అదే సమయంలో అధికారంలో వాటా ఇచ్చే ప్రసక్తే లేదని డీఎంకే తేల్చి చెప్పడంతో పాటు 25లోపు సీట్లను, ఒక రాజ్యసభ సీటును ఇవ్వడానికి ముందుకొచ్చినట్టు తెలిసింది. అయితే, కాంగ్రెస్‌ స్థానిక నేతలు తమ గళాన్ని తగ్గించలేదు. స్వరాన్ని పెంచడంతో సీట్ల పందేరాన్ని డీఎంకే నాన్చుడు ధోరణిలో పెట్టింది.

ఢిల్లీలో పంచాయితీ

తమిళనాడు కాంగ్రెస్‌ ఇన్‌చార్జ్‌ గిరిష్‌ చోదన్కర్‌, టీఎన్‌సీసీ అధ్యక్షుడు సెల్వ పెరుంతొగైతోపాటు ముఖ్యనేతలందరూ ఢిల్లీ వెళ్లారు. మంగళవారం ఏఐసీసీ పెద్దలతో సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో గిరిష్‌ మాట్లాడుతూ, డీఎంకేను కాంగ్రెస్‌ కమిటీ ప్రతినిధులు కలసి 70 రోజులు అవుతోందన్నారు. ఇంతవరకు సీట్ల విషయంగా ఎలాంటి నిర్ణయాన్ని డీఎంకే ప్రకటించలేదని, ఇది కాంగ్రెస్‌ వర్గాలలో అసంతృప్తిని రగిల్చినట్టుగా వ్యాఖ్యలు చేశారు. ఇకనైనా డీఎంకే ఎలాంటి చర్యలు తీసుకుంటుందో అని వేచి చూస్తామంటూ అసహనం వ్యక్తం చేశారు. అదే సమయంలో డీఎంకే డిప్యూటీ ప్రధాన కార్యదర్శి కనిమొళి మీడియాతో మాట్లాడుతూ డీఎంకే, కాంగ్రెస్‌ మధ్య ఎలాంటి అసంతృప్తి లేదని, త్వరలో డీఎంకే నేతృత్వంలో పొత్తు, సీట్ల పందేరం చర్చలకుగాను ఓ కమిటీ ఏర్పాటు కానున్నట్టు తెలిపారు. అంతవరకు వేచి ఉండాలని, ఆ కమిటీ మిత్రులందరితోనూ చర్చించి నిర్ణయం తీసుకుంటుందని పరోక్షంగా కాంగ్రెస్‌ నేతలకు హితవు పలకడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement