యువతతో అన్బుమణి ప్రతిజ్ఞ
సాక్షి, చైన్నె : డాక్టర్ అన్బుమణి నేతృత్వంలోని పీఎంకే యువజన విభాగం జనరల్ కమిటీ సమావేశం రాయపేటలో మంగళవారం జరిగింది. ఇందులో యువత చేత అన్బుమణి ప్రతిజ్ఞ చేయించారు. అన్నాడీఎంకే నేతృత్వంలోని కూటమిని అధికారంలోకి తీసుకొస్తామని ధీమా వ్యక్తం చేశారు. వివరాలు.. రాందాసు, అన్బుమణి నేతృత్వంలో వేర్వేరుగా పీఎంకే రెండు శిబిరాలుగా సాగుతున్న విషయం తెలిసిందే. ఈ పరిస్థితులలో అన్బుమణి నేతృత్వంలో రాష్ట్ర యువజన సమావేశం జరిగింది. ఇందులో తమిళనాడులోని వివిధ జిల్లాల నుండి వచ్చిన యువత చేత అన్బుమణి ప్రతిజ్ఞ చేయించారు. ప్రదానంగా విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, పరిశ్రమ, అవినీతిని నిర్మూలించడం, మాదక ద్రవ్యాల ప్రభావాల నివారణ, సీ్త్రల భద్రత, పర్యావరణ పరిరక్షణ వంటి 10 సామాజిక అంశాలపై దృష్టి పెడుతూ ఈ ప్రతిజ్ఞ జరిగింది. ఈ సందర్భంగా అన్బుమణి మాట్లాడుతూ, ఈ ప్రతిజ్ఞలు యువతను సమాజ అభివృద్ధి, తమిళనాడు పురోగతి , దేశ అభివృద్ధి కోసం కృషి చేయడానికి దారి చూపిస్తాయని వివరించారు. కూటమి విజయం కోసం పీఎంకె యువత కృషి చేయాలని పిలుపు నిచ్చారు. ఓ వైపు యువతను బలోపేతం చేసే దిశగా అన్బుమణి సమావేశాన్ని నిర్వహిస్తే, మరో వైపు ఆయన సతీమణి సౌమ్య అన్బుమణి నేతృత్వంలో మేట్టూరులో మద్యానికి వ్యతిరేకంగా మహిళలను బలోపేతం చేస్తూ ఉద్యమంగా ముందుకు సాగే రీతిలో సమావేశాన్ని నిర్వహించారు.


