ప్రొమో షూట్ స్టార్ట్!
తమిళసినిమా: ఒక భారీ చిత్రానికి ప్రొమో షూట్ స్టార్ట్ అయ్యిందన్నది తాజా సమాచారం. నటుడు కమలహాసన్, రజనీకాంత్ కలిసి నటించనున్నారన్నదే ప్రస్తుతం పెద్ద సంచలన వార్త. వీరిద్దరూ ఆరంభ కాలంలో పలు చిత్రాల్లో నటించారన్నది తెలిసిందే. కాగా ఆ తరువాత స్టార్‌ల స్థాయికి చేరుకున్న వీరు విడివిడిగా నటించడం మొదలెట్టారు. అలాంటిది సుమారు 40 ఏళ్ల తరువాత కమలహాసన్, రజనీకాంత్ కలిసి నటించడానికి సిద్దం అవుతున్నారు.దీని గురించి ఇంతకు ముందే అధికారికంగా ప్రకటించారు. కాగా ఇప్పుడు దీనికి సమయం వచ్చింది. నటుడు కమలహాసన్ తన రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మించనున్న ఈ చిత్రానికి రెడ్ జెయింట్ సంస్థ భాగస్వామ్యం కానుందని సమాచారం. కాగా ఈ చిత్రానికి జైలర్ చిత్రం ఫేమ్ నెల్సన్ దర్శకత్వం వహించనున్నారు. ఇది నటుడు కమలహాసన్‌కు 238వ చిత్రం,రజనీకాంత్‌కు 174వ చిత్రం అవుతుంది. ఈ చిత్రానికి రాజీవ్‌మీనన్ ఛాయాగ్రహణం అందించనున్నారు. త్వరలోనే ఈ చిత్రం సెట్ పైకి వెళ్లనుంది. కాగా ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన ప్రోమోను స్థానిక ప్రసాద్ స్టూడియోలో చిత్రీకరిస్తున్నట్లు తాజా సమాచారం. ఇందులో దర్శకుడు నెల్సన్, సంగీతదర్శకుడు అనిరుధ్ కూడా పాల్గొంటున్నట్లు తెలిసింది. దీంతో ఇప్పటి నుంచే ఈ క్రేజీ చిత్రం ప్రచారం మారుమోగనుందన్నమాట. ఇకపోతే ప్రస్తుతం జైలర్– 2 చిత్రాన్ని పూర్తి చేసిన రజనీకాంత్ తదుపరి సిబి.చక్రవర్తి దర్శకత్వంలో నటుడు కమలహాసన్ నిర్మించనున్న చిత్రంలో నటించనున్నారు. అదే విధంగా నటుడు కమలహాసన్ ప్రస్తుతం ఫైట్‌మాస్టర్స్ ద్వయం అన్బరివ్‌ల దర్శకత్వంలో నిర్మిస్తూ, కథానాయకుడిగా నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్‌టెయిన్ కథా చిత్రంలో నటిస్తున్నారు. దీని తరువాత తెలుగు చిత్రం కల్కీ– 2 చిత్రంలోనూ నటించడానికి సిద్ధం అవుతున్నారు.
ప్రొమో షూట్ స్టార్ట్!


