అభిమానులకు ఆత్మీయ పలకరింపు
సాక్షి, చైన్నె: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిని చూడాలనే ఆశతో మూడో రోజైన సోమవారం కూడా అభిమానులు వీజేపీ లే అవుట్‌కు భారీగా తరలి వచ్చారు. వీరందర్నీ ఆప్యాయంగా పలకరిస్తూ, తనతో ఫొటోలు దిగే అవకాశాన్ని వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి కల్పించారు. వివరాలు.. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చైన్నెకు వచ్చినప్పుడల్లా ఇక్కడి అభిమానం ఉప్పొంగుతుందన్న విషయం తెలిసిందే. అయితే ఈసారి అది రెట్టింపు స్థాయిలో ఉంది. కుటుంబ కార్యక్రమం నిమిత్తం శనివారం చైన్నెకు వచ్చిన జననేతకు అభిమానులు పట్టిన బ్రహ్మరథం గురించి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తరహాలో తమిళనాడు రాజధానిలోనూ అభిమానులు పోటెత్తారు. శనివారం రాత్రి సైతం అభిమానులు ఈంజంబాక్కం వీజీపీ లే అవుట్‌లోని సోదరుడు వైఎస్ అనిల్ రెడ్డి నివాసం వద్దకు పోటెత్తారు. రాత్రి సమయంలో సైతం ఇంటిపై నుంచి అభిమానులను ఆయన పలకరించారు. ఆదివారం కూడా అదే తరహాలో తరలివచ్చారు. ఇక సోమవారం చైన్నె పర్యటనను ముగించుకుని బెంగళూరుకు పయనం అవుతున్న సమయంలో సైతం జననేత కోసం అభిమానులు వందలాదిగా ఎదురు చూశారు. దీంతో వారందర్నీ ఆప్యాయంగా వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పలకరించారు. కొందరయితే, తమ నేతకు గుర్తుగా ఫొటోలను అందజేశారు. మహిళలు, పిల్లలు, కుటుంబ సమేతంగా ఎందరో అభిమానులు తరలి వచ్చినా అందర్నీ పలకరిస్తూ, ఫొటోలు దిగే అవకాశం కల్పించారు. అనంతరం వీజీపీ లే అవుట్ నుంచి బయలుదేరి సతీమణి వైఎస్ భారతిరెడ్డితో కలిసి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి విమానాశ్రయానికి చేరుకున్నారు. సోదరుడు వైఎస్ అనిల్ రెడ్డి, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వైఎస్‌ఆర్ సేవాదళ్ తమిళనాడు అధ్యక్షుడు జహీర్ హుస్సేన్ విమానాశ్రయంలో వీడ్కోలు పలికారు. సేవాదళ్ ప్రధాన కార్యదర్శి సూర్యారెడ్డి, అధికార ప్రతినిధి కృత్రిక, నేతలు భాను, నరేన్ తదితరులు విమానాశ్రయం వద్దకు తరలి వచ్చారు. అనంతరం చైన్నె పర్యటన ముగించుకుని బెంగళూరుకు జననేత బయలుదేరి వెళ్లారు.
అభిమానులకు ఆత్మీయ పలకరింపు
అభిమానులకు ఆత్మీయ పలకరింపు


