పారిశుధ్య కార్మికులకు సీఎం భోజన పథకం | - | Sakshi
Sakshi News home page

పారిశుధ్య కార్మికులకు సీఎం భోజన పథకం

Feb 10 2026 7:30 AM | Updated on Feb 10 2026 7:30 AM

పారిశ

పారిశుధ్య కార్మికులకు సీఎం భోజన పథకం

పథకంతో 1,29,689 మంది

పారిశుధ్య కార్మికులకు లబ్ధి

ఏటా ప్రభుత్వంపై 213.92 కోట్ల భారం

ముఖ్యమంత్రి స్టాలిన్‌

తిరువళ్లూరు: పారిశుధ్య కార్మికులకు భోజన పథకాన్ని ముఖ్యమంత్రి స్టాలిన్‌ సోమవారం ఉదయం తిరువళ్లూరు జిల్లా పోలీవాక్కంలో ప్రారంభించారు. వివరాలు.. చైన్నె కార్పొరేషన్‌లో పని చేసే పారిశుధ్య కార్మికులకు అల్పాహారం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గత నవంబర్‌ 15న ప్రారంభించింది. పథకం ఆశించిన స్థాయిలో సఫలం కావడంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మేజర్‌ పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలోని పారిశుధ్య కార్మికులకు విస్తరింప చేయాలని ముఖ్యమంత్రి స్టాలిన్‌ నిర్ణయించారు. ఇందులో భాగంగా పథకాన్ని విస్తరించే కార్యక్రమం తిరువళ్లూరు జిల్లాలోని పోలివాక్కంలో సోమవారం ఉదయం ముఖ్యమంత్రి స్టాలిన్‌ ప్రారంభించారు. ఈ పథకం ద్వారా చైన్నె కార్పొరేషన్‌ సహా 25 కార్పొరేషన్‌లు, 145 మున్సిపాలిటీలు, 479 పట్టణ పంచాయతీల్లోని లక్ష 29వేల 689 మంది కార్మికులకు లబ్ధి చేకూరనుంది. ఈ పథకం అమలు ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి 213.92 కోట్లు రూపాయల అదనపు భారం పడనుందని, నిధుల కొరత లేకుండా పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించినట్టు సీఎం తెలిపారు. దీంతో పాటు విధుల్లో ఉంటూ మృతి చెందిన పారిశుధ్య కార్మికులకు పది లక్షల ఆర్థిక సాయం, పక్కాగృహాలు కూడా అందించనున్నారు.

నిరాశ పరిచిన సీఎం

ముఖ్యమంత్రి కార్యక్రమం కోసం తిరువళ్లూరు జిల్లా పోలివాక్కంలో భారీగా ఏర్పాట్లు చేశారు. కార్యక్రమానికి తిరువళ్లూరు, తిరునిండ్రవూర్‌ మున్సిపాలిటీ, తిరుమళిసై మేజర్‌ పంచాయతీకి చెందిన పలువురు కార్మికులను పిలిపించారు. కార్యక్రమానికి హాజరైన సీఎంకు అధికారులు ఘనస్వాగతం కూడా పలికారు. అయితే ఎన్నికల దగ్గర పడుతున్న క్రమంలో పారిశుధ్య కార్మికులకు వరాల జల్లు కురిపిస్తామని కార్మికులు భావించారు. అయితే ముఖ్యమంత్రి పది నిమిషాల్లోనే కార్యక్రమాన్ని ముగించి వెళ్లిపోయారు. దీంతో కార్మికులు తీవ్ర నిరాశ చెందారు. అయితే సెక్యూరిటీని దాటుకుని కార్మికులతో షేక్‌హ్యాండ్‌, వారితో ఫొటోలకు దిగడంతో కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ శాఖ మంత్రి నెహ్రు, మైనారిటీ సంక్షేమశాఖ అధికారి నాజర్‌, ఆదిద్రావిడ సంక్షేమశాఖ మదివేందన్‌, ఎంపీ జగద్రక్షగన్‌, ఎమ్మెల్యేలు తిరుత్తణి చంద్రన్‌, తిరువళ్లూరు వీజీ రాజేంద్రన్‌, మాధవరం సుదర్శనం, పూందమల్లి కృష్ణస్వామి, మధురవాయల్‌ కారపాక్కం గణపతి, పొన్నేరి దురై చంద్రశేఖర్‌, ప్రఽభుత్వ ప్రధాన కార్యదర్శి మురుగానందం, కలెక్టర్‌ ప్రతాప్‌, మున్సిపల్‌శాఖ ప్రధాన కార్యదర్శి కార్తికేయన్‌, మున్సిపల్‌ శాఖ డైరెక్టర్‌ పల్లె మధుసూదన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వేలూరులో..

వేలూరు: వేలూరు కార్పొరేషన్‌ పరిధిలోని 2095 మంది పారిశుధ్య కార్మికులకు ఉదయం అల్పాహారం పథకాన్ని అందజేయనున్నట్లు కలెక్టర్‌ సుబ్బలక్ష్మి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని కార్పొరేషన్‌, మేజర్‌ గ్రామ పంచాయతీలోని పారిశుధ్య కార్మికులకు ఉదయం టిఫిన్‌ అందజేయాలనే పథకాన్ని రాష్ట్ర సీఎం స్టాలిన్‌ ప్రారంభించారు. దీంతో వేలూరు జిల్లాలోని పల్లిగొండ మేజర్‌ గ్రామ పంచాయతీలో ఈ పథకాన్ని ప్రారంభించారు. ఇందులో ఎమ్మెల్యే నందకుమార్‌, జడ్పీ చైర్మన్‌ బాబు, సర్పంచ్‌ సుప్రియ, కార్యనిర్వహణ అధికారి సుకుమార్‌ తదితరులు పాల్గొన్నారు. దీంతో వేలూరు కార్పొరేషన్‌లోని రెండో జోన్‌ సత్‌వచ్చారిలోని ప్రైవేటు కల్యాణ మండపంలో జోన్‌ చైర్మన్‌ వీనస్‌ నరేంద్రన్‌ ప్రారంభించారు. ఇందులో జోన్‌ ఆరోగ్యశాఖ అధికారి బాల మురుగన్‌, ఆరోగ్యశాఖ ఇన్‌స్పెక్టర్‌లు లోకనాథన్‌, ఆనందన్‌, నందిని, సూపర్‌ వైజర్‌ అశోక్‌ దేవాలతో పాటు కార్పొరేటర్లు, పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ వేలూరు కార్పొరేషన్‌ పరిధిలోని మొత్తం 60 వార్డుల్లో మొత్తం 2095 మంది పారిశుధ్య కార్మికులున్నారని ఉదయం 2075 మంది రాత్రి వేళల్లో 20 మంది పని చేస్తున్నారన్నారు. వీరికి అవసరమైన ఆహారాన్ని ఒక చోట తయారు చేసి మొత్తం నాలుగు జోన్‌లకు ఆరు వాహనాల్లో తీసుకెళ్లి మొత్తం 54 చోట్ల ఆహారాన్ని అందజేయనున్నట్లు తెలిపారు. వారంలో ఆరు రోజులపాటు ఒక్కో రోజు ఒక్కో రకమైన టిఫిన్‌ను అందజేయనున్నట్లు తెలిపారు.

పారిశుధ్య కార్మికులకు సీఎం భోజన పథకం1
1/1

పారిశుధ్య కార్మికులకు సీఎం భోజన పథకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement