చంద్రప్రభపై నీలకంఠుడు
నాగలాపురం: మండలంలోని సురుటుపళ్లి గ్రామంలో ప్రదోష క్షేత్రంగా భాసిల్లుతున్న సర్వమంగళ సమేత శ్రీపళ్లికొండేశ్వర స్వామి ఆలయంలో మాహా శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిత్య వాహన సేవలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా మూడవ రోజు సోమవారం చంద్రప్రభ వాహనంపై స్వామివారు భక్తులను కటాక్షించారు. ఉదయం ఆలయ ప్రధాన అర్చకులు కార్తికేయ గురుక్కల్ ఆధ్వర్యంలో అర్చకులు వేద మంత్రాలు, మంగళ వాయుద్యాల నడుమ శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. సాయంత్రం 7 గంటలకు చంద్రప్రభ వాహనంపై శ్రీకై లాసనాథుడిని, శ్రీపార్వతి దేవిని అధిష్టించి పరిమళాలు వెదజెల్లే పుష్పాలు, స్వర్ణాభరణాలతో సుందరంగా అలంకరించి, వివిధ రకాల హారతులు సమర్పించారు. అనంతరం రాత్రి 8 గంటలకు వేద మంత్రోచ్ఛారణ నడుమ స్వామి అమ్మవార్లను ఊరేగించారు. వాహన సేవ ఉభయదారులుగా సత్యవేడుకు చెందిన వి.యన్.పరమశివన్, ఆలయ మాజీ చైర్మన్ తిరునీలకంఠం, వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. గ్రామోత్సవంలో కోలాట భజనలు, ఆలయ మండపంలో చిన్నారులు భరతనాట్యం ప్రదర్శన భక్తులను ఆకట్టుకుంది. శివరాత్రి బ్రహ్మోత్సవ ఏర్పాట్లను ఆలయ చైర్మన్ పద్మనాభరాజు, ఈఓ లత, సిబ్బంది పర్యవేక్షించారు.


