క్రీడాకారులకు తోడ్పాటుగా స్పోర్ట్స్ వైద్య కోర్సు
సాక్షి, చైన్నె : ఆసియన్ ఫుట్‌బాల్ కాన్ఫెడరేషన్ , ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ సహకారంతో శ్రీ రామచంద్ర సెంటర్ ఫర్ స్పోర్ట్స్ సైన్స్‌లో ఫుట్‌బాల్ ఎమర్జెన్సీ వైద్యం – యాంటీ–డోపింగ్ రీజినల్ పేరిట నాలుగు రోజులు కార్యక్రమం జరిగింది. ఇందులో ఫిలిప్పీనన్స్, మలేషియా, బంగ్లాదేశ్, మాల్దీవులు, శ్రీలంక, కిర్గిజ్‌స్తాన్, ఉజ్బెకిస్తాన్, తుర్క్‌మెనిస్తాన్, తజికిస్తాన్, భూటాన్, నేపాల్, తదితర సభ్య దేశాల నుంచి 50 మంది వైద్య నిపుణులు, ఫిజియోథెరపిస్టులు తరలి వచ్చారు. డాక్టర్ గుర్చరన్ సింగ్ మాట్లాడుతూ, ఫుట్‌బాల్ ప్రపంచ కప్ గెలవడమే ఆసియా ఫుట్‌బాల్ దీర్ఘకాలిక లక్ష్యంగా పేర్కొన్నారు. ఆటగాళ్ల శిక్షణతోపాటు వైద్య సహాయం, స్పోర్ట్స్ సైన్స్ కీలక పాత్ర పోషిస్తాయన్నారు. ఏఐఎఫ్‌ఎఫ్ అధ్యక్షుడు కళ్యాణ్ చౌబే మాట్లాడుతూ తాజా కోర్సు దేశవ్యాప్తంగా ఉన్న వైద్య నిపుణులు, శాసీ్త్రయ బృందాలకు ప్రాక్టికల్ అనుభవం ఇవ్వడం ద్వారా ఆటగాళ్ల భద్రతను పెంచుతుందన్నారు. శ్రీ రామచంద్ర సెంటర్ డైరెక్టర్ డాక్టర్ ఎస్. అరుముగం మాట్లాడుతూ, కోర్సు గాయాలు, ఆకస్మిక గుండె సంబంధిత పరిస్థితులలో వైద్య అత్యవసర పరిస్థితుల నిర్వహణలో అప్డేట్స్ ఇస్తుందన్నారు. ఈ సందర్భంగా అత్యాధునిక వైద్య పరికరాలను ఆవిష్కరించారు.


