అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుంటే అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తా: అన్నాలై

- - Sakshi

అన్నాడీఎంకేతో ఇక కటీఫ్‌, ఆ పార్టీతో కూటమి పెట్టుకుంటే పార్టీ పదవికి రాజీనామా చేస్తానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి. ప్రధానంగా ఆయన అన్నాడీఎంకేను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదమైంది. అయితే, కూటమి ఎవరెవరితో అని నిర్ణయించేది బీజేపీ కాదని, తాము మాత్రమే అని అన్నాడీఎంకే సీనియర్‌ నేతలు అన్నామలైపై ఎదురు దాడికి దిగారు.

సాక్షి, చైన్నె: గత కొద్ది రోజులుగా పళణిస్వామి నేతృత్వంలోని అన్నాడీఎంకే శిబిరం, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. బీజేపీతో పొత్తు అవసరమా..? అనే అంశాన్ని అన్నాడీఎంకే ఇప్పటికే తీవ్రంగా చర్చిస్తోంది. అయితే, జాతీయ స్థాయి పార్టీ కావడంతో ఆచీ తూచీగా స్పందిస్తూ వస్తోంది. ఈ పరిస్థితుల్లో చైన్నెలో జరిగిన పార్టీ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై చేసిన వ్యాఖ్యలు అన్నాడీఎంకే వర్గాలకు అనుకూలంగా మారాయనే ప్రచారం సాగుతోంది.

వైరల్‌ అవుతున్న కటీఫ్‌ వ్యాఖ్యలు

చైన్నెలో శనివారం జరిగిన పార్టీ కార్యాక్రమంలో అన్నామలై అన్నాడీఎంకేపై తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లు సామాజిక మాధ్యమాలు, కొన్ని చానళ్లలో జోరుగా ప్రచారం సాగింది. అందులోని అంశాల మేరకు వివరాలు... రానున్న లోక్‌ పసభ ఎన్నికలకు బూత్‌ కమిటీల ఏర్పాటు, పార్టీకి విరాళాల సేకరణ గురించి నేతలకు ఈ సమావేశంలో అన్నామలై నాయకులకు హితబోధ చేశారు. పార్టీ బలోపేతం దిశగా సాగుదామని పిలుపు నిచ్చారు. ఎన్నికల సమయంలో ఎవ్వరెవ్వరికో శాలువలు కప్పి కూటమిలోకి ఆహ్వానించాల్సిన అవసరం లేదన్నారు. ద్రవిడ పార్టీలతో కలిసి ఎన్నికలను ఎదుర్కొనడం తనకు ఇష్టం లేదని స్పష్టం చేశారు. పొత్తు ఎవరితో అనే నిర్ణయం మనమే తీసుకుందామని, ఒంటరిగా వెళ్లినప్పుడే బీజేపీ బలం ఏమిటో ద్రవిడ పార్టీలకు తెలియజేయగలమని అభిప్రాయపడ్డారు. అన్నాడీఎంకేలో పొత్తు పెట్టుకుంటే, పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి, సాధారణ కార్యకర్తగా బీజేపీలో కొనసాగుతానని వ్యాఖ్యానించారు.

ప్రధాని నరేంద్ర మోదీనికి కలిసి అన్ని వివరాలను తెలియజేయడానికి ప్రయత్నం చేస్తున్నానని పేర్కొన్నారు. కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో కొద్ది రోజులు బిజీ బీజీగా ఉంటానని, ఈ సమయంలో పార్టీ కేడర్‌ ప్రజల్లోకి చొచ్చుకు వెళ్లే కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపు నిచ్చారు. అయితే, కూటమి విషయంపై అన్నామలై చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలోని ద్వితీయ శ్రేణి నేతలలో వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఆ పార్టీ శాసన సభా పక్ష నేత నయనార్‌ నాగేంద్రన్‌ స్పందిస్తూ, కూటమి విషయాన్ని నిర్ణయించాల్సింది పార్టీ రాష్ట్ర విభాగం కాదని, బీజేపీ అధిష్టానం అనే విషయాన్ని అన్నామలై గుర్తంచాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. అయితే బీజేపీలోని కొందరు నేతలు అన్నామలై వ్యాఖ్యలను వక్రీకరించినట్లు పేర్కొన్నారు. తమ పార్టీ సమావేశంలో జరిగిన చర్చ, అభిప్రాయాలు, వ్యాఖ్యలను బయటకు వెళ్లగక్కి ఎవరో రాజకీయం చేస్తున్నట్లుందని విమర్శించారు.

దీటుగా స్పందించిన పళణివర్గం..
న్నామలై వ్యాఖ్యలకు అన్నాడీఎంకే వర్గాలు దీటుగా స్పందించాయి. అన్నాడీఎంకే సీనియర్లు జయకుమార్‌, ఓఎస్‌ మణియన్‌ పేర్కొంటూ. రాష్ట్రంలో పొత్తు గురించి నిర్ణయం తీసుకోవాల్సింది బీజేపీ కాదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అన్నాడీఎంకే నేతృత్వంలోని కూటమిలో ఇతర పార్టీలు ఉంటాయనే విషయాన్ని ఆయన గుర్తుంచుకోవాలని చురకలు అంటించారు. ఎవరికి వంగి..వంగి దండాలు పెట్టాల్సిన అవసరం అన్నాడీఎంకేకు లేదని, అలా పెట్టే ప్రసక్తి కూడా లేదని తేల్చిచెప్పారు.

Read latest Tamil Nadu News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top