చలో విజయవాడను విజయవంతం చేయండి
ధర్మవరం అర్బన్: పీఆర్‌సీ, ఐఆర్, డీఏ తదితర హామీల అమలు సాధన కోసం ఈనెల 17న చేపట్టనున్న చలో విజయవాడ రణభేరి 2.0ను విజయవంతం చేయాలని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శెట్టిపి జయచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. పట్టణంలోని యూటీఎఫ్ ప్రాంతీయ కార్యాలయంలో ఆదివారం నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జయచంద్రారెడ్డి మాట్లాడుతూ 12వ పీఆర్‌సీ 2023 జూలై నుంచి అమలు కావాల్సి ఉండగా నేటికీ కనీసం పీఆర్‌సీ కమిషన్‌ను నియమించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమన్నారు. పీఆర్‌సీ కమిషన్ వెంటనే నియమించాలని, 29 శాతం ఐఆర్ ప్రకటించాలని, సీపీఎస్ రద్దు చేయాలని, పెండింగ్ డీఏలను చెల్లించాలని, మెమో 57ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యో, ఉపాధ్యాయ, కార్మికుల ఆర్థిక ప్రయోజనాల కోసం 17న యూటీఎఫ్ ఆధ్వర్యంలో జరుగుతున్న చలో విజయవాడ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు హాజరై విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణనాయక్, కార్యదర్శి అమర్‌నారాయణరెడ్డి, జిల్లా ఆడిట్ కమిటీ సభ్యులు ఎం.ఆదినారాయణ, డివిజన్ నాయకులు ఆంజనేయులు, లక్ష్మయ్య, సకల చంద్రశేఖర్, రాంప్రసాద్, పెద్దకోట్ల సురేష్, వెంకట కిషోర్, ప్రదీప్, సాయి గణేష్, ఆదిశేషు, పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.


