వైద్యం.. దైవాధీనం
పెనుకొండ రూరల్: ఆంధ్రప్రదేశ్ వైద్యవిధాన పరిషత్ ఆధ్వర్యంలో అప్పుడెప్పుడో పెనుకొండలో
కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఏర్పాటు చేశారు. పేరుకు 50 పడకలు ఉన్నా...సిబ్బంది, సౌకర్యాల కొరత వేధిస్తోంది. 2011లో పట్టణ జనాభా 21 వేలు ఉండగా.. ప్రస్తుతం 42 వేలు దాటిపోయింది. దీనికి తోడు కియా కార్మికుల కుటుంబాలతో అది రెట్టింపయ్యింది. ఇక చుట్టుపక్కల ఉన్న పలు మండలాల వారు ఏ ఆరోగ్య సమస్య తలెత్తినా పెనుకొండకు వస్తారు. కానీ ఇక్కడి వైద్యులు ప్రథమ చికిత్స చేసి అనంతపురానికి రెఫర్ చేస్తున్నారు. దీంతో నిరుపేదలు పడరానిపాట్లు పడుతున్నారు.
పెరిగిన ప్రమాదాలు..అందని వైద్య సేవలు..
44వ జాతీయ రహదారి పెనుకొం సమీపంలోనే ఉంటుంది. ఈ రహదారిపై నిత్యం వేల సంఖ్యలో వాహనాలు తిరుగుతుంటాయి. రైల్వే జంక్షన్, కియా పరిశ్రమ రావడంతో వాహనాల రద్దీ మరింత పెరిగింది. రెండేళ్లుగా రోడ్డు ప్రమాదాలు కూడా బాగా పెరిగాయి. దీంతో ఏ చిన్న ప్రమాదం జరిగిన క్షతగాత్రులను పెనుకొండ ఆస్పత్రికి తీసుకువస్తున్నారు. కానీ ఇక్కడ ప్రాథమిక వైద్యం మాత్రం చేస్తున్నారు. మెరుగైన వైద్యం కోసం అనంతపురం వెళ్లాలంటే 72 కి.మీ, హిందూపురం వెళ్లాలంటే 35 కి.మీ. బెంగళూరుకు అయితే 125 కి.మీ ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో క్షతగాత్రులు మార్గమధ్యంలోనే మృత్యు ఒడికి చేరుతున్నారు. ఇక్కడి వైద్యులు కూడా వేలు విరిగినా...కాలు విరిగినా కట్టుకట్టి ‘రెఫర్’ అంటూ తప్పించుకుంటున్నారు.
భారీగా పెరిగిన ఓపీ..
‘కియా’ పరిశ్రమలో పనిచేసే ఇతర రాష్ట్రాల కార్మికులు పెనుకొండ, గుట్టూరు, అమ్మవారిపల్లి. ప్రాంతాల్లో అద్దెకు ఉంటున్నారు. దీంతో ఏ చిన్న ఆరోగ్య సమస్య తలెత్తినా వారంతా పెనుకొండ ఆస్పత్రికే వస్తున్నారు. ప్రతి సోమవారం ఇక్కడ ఓపీ 500 దాటుతోంది. కానీ ఇక్కడ చిన్న పిల్లల వైద్యుడే లేకపోవడంతో కార్మికులు ప్రైవేటుకు వెళ్లి జేబులు ఖాళీ చేసుకుంటున్నారు. జలుబు, దగ్గు, జ్వరం, విరేచనాలు, ఒళ్లు నొప్పులు తదితర వాటికే కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో వైద్యం అందుతోందని స్థానికులు చెబుతున్నారు.
అలంకార ప్రాయంగా నూతన గదులు..
పెనుకొండ సీహెచ్‌సీ ప్రాముఖ్యాన్ని గుర్తించిన గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ‘నాడు– నేడు’ కింద ఆస్పత్రిలో అదనపు గదులను నిర్మించింది. దాదాపు 100 పడకలకు సరిపోయేలా సౌకర్యాలూ కల్పించింది. జాతీయ రహదారి పక్కనే ఉండటం... రోడ్డు ప్రమాద కేసులు ఎక్కువగా వస్తుండటంతో రూ.65 లక్షలతో ట్రామా కేర్ సెంటర్‌ను నిర్మించింది. ఆస్పత్రి ప్రాంగణంలో ప్రసవాల కోసం నూతన భవనాన్ని నిర్మించారు. ఆ తర్వాత ప్రభుత్వం మారగా...వాటిని పట్టించుకున్న వారే లేకుండా పోయారు. చంద్రబాబు సర్కార్ ప్రత్యేక పరికరాలు, అదనపు సిబ్బంది ఏర్పాటు చేయకపోవడంతో ట్రామా కేర్, గర్భిణులు, బాలింతల కోసం నిర్మించిన భవనం నిర్వీర్యంగా మారాయి. ఇక నూతన గదులను ఓపీ కోసం, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ ఆఫీసు కోసం వాడుకుంటున్నారు.
పేరుకే నిఘా నేత్రాలు..
దాదాపుగా 3 ఎకరాల్లో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రిలో 5 సీసీ కెమెరాలు ఉన్నాయి. అవి కూడా నిర్వహణ కొరవడటంతో పనిచేయడం లేదు. దీంతో రాత్రి వేళల్లో గుర్తు తెలియని వ్యక్తులు ఆస్పత్రిలోకి వస్తుండటంతో అడ్మిషన్‌లో ఉంటున్న రోగులు, వారి బంధువులు భయపడిపోతున్నారు.
మెడికల్ కాలేజీకి మోకాలడ్డు..
పెనుకొండ ప్రాముఖ్యతను గుర్తించిన వైఎస్ జగన్ తన హయాంలో ఇక్కడ నూతన మెడికల్ కళాశాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. తద్వారా ఈప్రాంత వాసులకు కార్పొరేట్ వైద్యం అందించాలని భావించారు. పట్టణానికి సమీపంలోని షీఫారం వద్ద 54 ఎకరాల్లో దాదాపు రూ.500 కోట్ల నిధులతో నిర్మాణ పనులను చేపట్టారు. పెనుకొండ ప్రాంతాన్ని మెడికల్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు అడుగులు వేశారు. దీంతో ఈ ప్రాంత వాసులు కూడా ఎంతో ఆనంద పడ్డారు. కానీ అంతలోనే ఎన్నికలు రావడం...ఆ తర్వాత చంద్రబాబు ప్రభుత్వం కొలువుదీరడంతో పెనుకొండ వాసుల కల చెదిరిపోయింది. మెడికల్ కాలేజీని పీపీపీ పద్ధతిలో ప్రైవేటుకు అప్పగించాలని చంద్రబాబు సర్కార్ నిర్ణయించింది.
మంత్రి ఉన్నా... ప్రయోజనం సున్నా..
పెనుకొండ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న సవిత మంత్రిగా ఉన్నప్పటికీ... ఈ ప్రాంత వాసుల సమస్యలు ఆమెకు పట్టడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. పెనుకొండకు గుండెకాయలాంటి మెడికల్ కళాశాల ప్రైవేటుకు అప్పగిస్తామని చంద్రబాబు చెప్పినా...ఆమె కనీసం దాని గురించి మాట్లాడలేక పోయారు. తనకు మంత్రి పదవి ఉంటే చాలని, పెనుకొండ ప్రజలు ఏమైనా ఫర్వాలేదనేలా వ్యవహరిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు.
పెనుకొండ...జిల్లాకు కేంద్ర బిందువు. ఓ వైపు కియా..మరోవైపు రైల్వే జంక్షన్..ఇంకోవైపు ఎన్‌హెచ్–44. రోజురోజుకూ పెరుగుతున్న పట్టణ జనాభా. కానీ కనీస సౌకర్యాలు తీసికట్టుగా మారాయి. కీలకమైన వైద్య సేవలు మరింత దారుణమయ్యాయి. పేరుకు 50 పడకల ఆస్పత్రి ఉన్నా..సిబ్బంది కొరత..వైద్య పరికరాలు లేక దిష్టిబొమ్మగా మారింది. ఎన్‌హెచ్–44లో ఎక్కడ ప్రమాదం జరిగినా క్షతగాత్రులను పెనుకొండ ఆస్పత్రికి చేరుస్తారు. కానీ ఇక్కడ సకాలంలో వైద్యం అందక ఎందరో ప్రాణాలు కోల్పోయారు. అందుకే ఇక్కడ మెడికల్ కళాశాల నిర్మాణానికి వైఎస్ జగన్ శ్రీకారం చుట్టగా...చంద్రబాబు సర్కార్ పీపీపీ అంటూ నిలిపివేసింది.
పేరుకే ఆస్పత్రి.. ప్రథమ చికిత్సతో సరి
సిబ్బంది కొరత...
సౌకర్యాలు లేక ఇబ్బందులు
చిన్నపాటి వైద్యానికి అనంతపురం వెళ్లాలంటున్న వైద్యులు
44వ జాతీయ రహదారిపై
పెరిగిన ప్రమాదాలు
సకాలంలో వైద్యం అందక
గాల్లో కలుస్తున్న ప్రాణాలు
ఇతర ప్రాంతాలకు వెళ్తున్నాం
గత ఏడాది పొలంలో పనిచేస్తుండగా నన్ను పాము కరిచింది. పెనుకొండ ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లగా ప్రథమ చికిత్స చేసిన వైద్యులు.. అనంతపురం వెళ్లండని సలహా ఇచ్చారు. అద్దె వాహనంలో 72 కి.మీ దూరం వెళ్లాల్సి వచ్చింది. ఆస్పత్రిలో మెరుగైన వైద్య సేవలు అందిస్తే నాలాంటి ఎందరికో మేలు జరుగుతుంది. ప్రాణాపాయ పరిస్థితుల నుంచి బయట పడే అవకాశం ఉంటుంది. ఇక్కడి ప్రజాప్రతినిధులైనా ఆస్పత్రి గురించి పట్టించుకోవాలి.
–సుబ్బిరెడ్డి, గొల్లపల్లి
సిబ్బంది లేకే ఇబ్బంది
ఆస్పత్రిలో ముగ్గురు వైద్యుల కొరత ఉన్నప్పటికీ సీహెచ్‌సీ నిబంధనలు ప్రకారం వైద్య సేవలు అందిస్తున్నాం. వంద పడకల ఆస్పత్రిగా మారిస్తే సివిల్ సర్జన్‌లతో పాటు, న్యూరో డాక్టర్లు, అత్యవసర వైద్య సిబ్బంది అందుబాటులోకి వస్తారు. సౌకర్యాలు కూడా మెరుగుపడతాయి. దీంతో ఏ సమయంలో ఏ కేసు వచ్చినా... మెరుగైన వైద్య సేవలు అందించవచ్చు. – మెహన్‌నాయక్, ఆస్పత్రి సూపరింటెండెంట్
వైద్యం.. దైవాధీనం
వైద్యం.. దైవాధీనం
వైద్యం.. దైవాధీనం
వైద్యం.. దైవాధీనం


