భార్య రివాబాతో రవీంద్ర జడేజా, సోదరి నైనాబా జడేజా
టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా గుజరాత్ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారు. ప్రస్తుతం జామ్‌నగర్ నార్త్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన రివాబా విద్యాశాఖ మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే ఆమె వదిన, జడేజా సోదరి నైనాబా తాజాగా గుజరాత్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
దీంతో జడేజా ఇంట మరోసారి రాజకీయ విభేదాలు బయటపడ్డాయి. విషయంలోకి వెళితే.. ఇటీవల రాజ్‌కోట్‌కు మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. నైనాబా జడేజా రాజ్‌కోట్ మున్సిపల్ కార్పొరేషన్‌లోని వార్డ్ నెం-2 నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. మంగళవారం మున్సి పల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరిగింది.
ఈ ఎన్నికల్లో నైనాబా మరోసారి పరాజయం పాలయ్యారు. అయితే ఆమె ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ, జడేజా జీవితంలో నైనాబాది కీలక పాత్ర అని చెప్పొచ్చు. జడేజా క్రికెట్ విజయ ప్రస్థానంలో నైనాబా ముఖ్యపాత్ర పోషించినట్లు జడ్డూ చాలా సందర్భాల్లో పేర్కొన్నాడు. ఇటీవలే మంత్రి హోదాలో రివాబా రాజ్‌కోట్ సందర్శనకు వచ్చినప్పుడు కూడా నైనాబా ఆమెకు వ్యతిరేకంగా మాట్లాడడం కనిపించింది.
గతంలో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు సమయంలోనూ రివాబా జడేజా, నైనాబా జడేజా ప్రత్యర్థులుగా ఒకరిపై ఒకరు కత్తులు దూసుకున్నారు. అప్పట్లో జడేజా భార్య రివాబా జడేజాను జామ్‌నగర్ నార్త్ స్థానం నుంచి బీజేపీ ఎన్నికల బరిలో దించింది. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ వెంటనే జడేజా సోదరి నైనాబాను స్టార్ క్యాంపెయినర్ జాబితాలో చేర్చి జామ్‌నగర్‌లో ప్రచారానికి పంపింది.
అయితే ఆ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన రివాబా వదిన నైనాబాపై విజయం సాధించింది. తాజాగా మున్సిపల్ ఎన్నికల్లోనూ మరోసారి నైనాబా ఓటమి పాలవ్వడంతో మంత్రిగా ఉన్న రివాబా తన వదినపై రాజకీయంగా ఆధిక్యతను మరోసారి కొనసాగించింది.
ఇక రవీంద్ర జడేజా ప్రస్తుతం ఐపీఎల్ 2026 సీజన్‌లో బిజీగా గడుపుతున్నాడు. ఈ సీజన్‌కు ముందు ట్రేడింగ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ నుంచి రాజస్తాన్ రాయల్స్‌కు మారిన జడేజా ఈ సీజన్‌లో ఇప్పటివరకు 9 మ్యాచ్‌లాడి 132 పరుగులు చేయడంతో పాటు ఆరు వికెట్లు తీశాడు.


