Tokyo Olympics: 49 ఏళ్ల తర్వాత సెమీస్‌లో

Indian Hockey Team Reach Semi Finals of The Olympics After 49 years - Sakshi

ఒలింపిక్స్‌లో సెమీఫైనల్‌ చేరిన భారత పురుషుల హాకీ జట్టు

క్వార్టర్‌ ఫైనల్లో బ్రిటన్‌పై 3–1తో విజయం

రేపు ప్రపంచ చాంపియన్‌ బెల్జియంతో సెమీఫైనల్లో ‘ఢీ’

జాతీయ క్రీడకు కొత్త ఊపిరి వచ్చింది. విశ్వ క్రీడల్లో భారత పురుషుల హాకీ జట్టు మెరిసింది. ఏకంగా 49 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఒలింపిక్స్‌లో మళ్లీ టీమిండియా సెమీఫైనల్‌ దశకు అర్హత సాధించింది. 1980 మాస్కో ఒలింపిక్స్‌లో భారత్‌ ఫైనల్‌ చేరి స్వర్ణ పతకం సాధించినా... ఆ క్రీడల్లో నాకౌట్‌ ఫార్మాట్‌ను నిర్వహించలేదు. ఆరు జట్లు మాత్రమే పాల్గొనడంతో లీగ్‌ ఫార్మాట్‌ ద్వారా ఫైనలిస్ట్‌లను ఖరారు చేశారు. చివరిసారి భారత్‌ 1972 మ్యూనిక్‌ ఒలింపిక్స్‌లో సెమీఫైనల్‌ చేరింది. సెమీఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ చేతిలో 0–2తో ఓడిపోయింది. మూడో స్థానం పోరులో టీమిండియా 2–1తో నెదర్లాండ్స్‌ను ఓడించి కాంస్యం గెల్చుకుంది.

టోక్యో: ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు 41 ఏళ్ల తర్వాత అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. 1980 మాస్కో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన తర్వాత భారత జట్టు... అనంతరం జరిగిన తొమ్మిది ఒలింపిక్స్‌లలో క్వార్టర్‌ ఫైనల్‌ దశను దాటలేకపోయింది. ఈసారి మాత్రం పక్కా ప్రణాళికతో, పట్టుదలతో ఆడి సెమీఫైనల్లోకి దూసుకెళ్లి పతకం రేసులో నిలిచింది. ఆదివారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో మన్‌ప్రీత్‌ సింగ్‌ నాయకత్వంలోని భారత జట్టు 3–1తో గ్రేట్‌ బ్రిటన్‌ జట్టును ఓడించింది. భారత్‌ తరఫున దిల్‌ప్రీత్‌ సింగ్‌ (7వ ని.లో), గుర్జంత్‌ సింగ్‌ (16వ ని.లో), హార్దిక్‌ సింగ్‌ (57వ ని.లో) ఒక్కో గోల్‌ చేశారు. గ్రేట్‌ బ్రిటన్‌ తరఫున ఏకైక గోల్‌ను సామ్‌ వార్డ్‌ (45వ ని.లో) సాధించాడు. మంగళవారం జరిగే సెమీఫైనల్లో ప్రస్తుత ప్రపంచ చాంపియన్‌ బెల్జియం జట్టుతో భారత్‌ తలపడుతుంది. మరో సెమీఫైనల్లో జర్మనీతో ఆస్ట్రేలియా ఆడుతుంది.

ఇతర క్వార్టర్‌ ఫైనల్స్‌లో బెల్జియం 3–1తో స్పెయిన్‌పై; జర్మనీ 3–1తో అర్జెంటీనాపై గెలుపొందగా... ఆస్ట్రేలియా ‘పెనాల్టీ షూటౌట్‌’లో 3–0 తో నెదర్లాండ్స్‌ను ఓడించింది. బ్రిటన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. ఈ క్రమంలో కొన్నిసార్లు డిఫెన్స్‌లో తడబడింది. బ్రిటన్‌ ఏకంగా ఎనిమిది పెనాల్టీ కార్నర్‌లు సంపాదించినా ఒక్కసారి మాత్రమే సఫలమైంది. మ్యాచ్‌ ముగియడానికి మరో మూడు నిమిషాలు ఉందనగా భారత్‌ 2–1తో ఒక గోల్‌ ఆధిక్యంలో మాత్రమే ఉంది. అయితే హార్దిక్‌ సింగ్‌ గోల్‌ చేయడంతో భారత ఆధిక్యం 3–1కి పెరిగింది. చివరి మూడు నిమిషాల్లో బ్రిటన్‌ గోల్‌ చేయడానికి తీవ్రంగా యత్నించినా భారత జట్టు వారి దాడులను వమ్ము చేసింది.    

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top