SA vs IND: తొలి టెస్ట్‌లో చిత్తుగా ఓడిన దక్షిణాఫ్రికా.. భారత్‌ ఘన విజయం

India Beat South Africa To Create History - Sakshi

తొలి టెస్టులో భారత్‌ ఘన విజయం

113 పరుగులతో దక్షిణాఫ్రికా చిత్తు

రెండో ఇన్నింగ్స్‌లో 191 ఆలౌట్‌

సోమవారం నుంచి రెండో టెస్టు

దక్షిణాఫ్రికా గడ్డపై తొలి సారి టెస్టు సిరీస్‌ గెలుచుకునే లక్ష్యంతో అడుగు పెట్టిన భారత జట్టు తొలి అడ్డంకిని ఘనంగా అధిగమించింది... సఫారీలకు కోటలాంటి సెంచూరియన్‌ను బద్దలు కొట్టి సిరీస్‌లో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది...చివరి రోజు ఆరు వికెట్లు తీసే క్రమంలో అటు దక్షిణాఫ్రికా బ్యాటర్లతో పాటు ఇటు వర్షంతో కూడా పోటీ పడాల్సిన స్థితిలో బరిలోకి దిగిన టీమిండియా ఎలాంటి ప్రమాదం లేకుండా లాంఛనాన్ని పూర్తి చేసింది.

మన పేసర్ల పదునైన బౌలింగ్‌ ముందు బ్యాటర్లు నిలబడలేకపోగా... మధ్యాహ్నం తర్వాత వాన పడే అవకాశం ఉండగా, అంతకు ముందే కోహ్లి సేన  వేగంగా ఆటను ముగించింది. వచ్చే వారం మలి మజిలీ జొహన్నెస్‌బర్గ్‌నూ జయిస్తే భారత టెస్టు చరిత్రలో మరో చిరస్మరణీయ ఘనత నమోదవుతుంది.  

సెంచూరియన్‌: దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో భారత్‌ 113 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 305 పరుగుల లక్ష్యాన్ని అందుకునే ప్రయత్నంలో 94/4నుంచి చివరి రోజు ఆటను కొనసాగించిన దక్షిణాఫ్రికా తమ రెండో ఇన్నింగ్స్‌లో 191 పరుగులకు ఆలౌటైంది. గురువారం ఆటలో 97 పరుగులే జోడించిన సఫారీ జట్టు మిగిలిన 6 వికెట్లు కోల్పోయింది. కెప్టెన్‌ డీన్‌ ఎల్గర్‌ (156 బంతుల్లో 77; 12 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో బుమ్రా, షమీ చెరో 3 వికెట్లు తీయగా...అశ్విన్, సిరాజ్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించిన కేఎల్‌ రాహుల్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచాడు. జనవరి 3 నుంచి జొహన్నెస్‌బర్గ్‌లో రెండో టెస్టు జరుగుతుంది.  
 

27.1 ఓవర్లలో...
చివరి రోజు ఇద్దరు ప్రధాన బ్యాటర్లు ఎల్గర్, బవుమా దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. వీరిద్దరు ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్‌ చేస్తూ చకచకా పరుగులు సాధించారు. అయితే అది ఎంతో సేపు సాగలేదు. ఎల్గర్‌ను బుమ్రా వికెట్ల ముందు దొరికించుకోవడంతో సఫారీల పతనం ప్రారంభమైంది. దూకుడుగా ఆడి బౌలర్లపై పైచేయి సాధించేందుకు ప్రయత్నించిన డి కాక్‌ (21)ను సిరాజ్‌ అవుట్‌ చేయడంతో జట్టు ఆశలు సన్నగిల్లాయి.

తర్వాతి ఓవర్లోనే ముల్డర్‌ (1) వెనుదిరగడంతో ‘డ్రా’కు ప్రయత్నించే అవకాశం కూడా కనిపించలేదు. లంచ్‌ సమయానికి స్కోరు 182/7 వద్ద నిలిచింది. ఒక వైపు తెంబా బవుమా (35 నాటౌట్‌) పోరాడినా... రెండో సెషన్‌లో దక్షిణాఫ్రికా ఆట ముగించేందుకు రెండు ఓవర్లు సరిపోయాయి. అశ్విన్‌ వరుస బంతుల్లో చివరి రెండు వికెట్లు తీసి గెలుపు లాంఛనం పూర్తి చేశాడు.


స్కోరు వివరాలు

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 327, దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌:197, భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: 174, దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌: మార్క్‌రమ్‌ (బి) షమీ 1; ఎల్గర్‌ (ఎల్బీ) (బి) బుమ్రా 77; పీటర్సన్‌ (సి) పంత్‌ (బి) సిరాజ్‌ 17; వాన్‌ డర్‌ డసెన్‌ (బి) బుమ్రా 11; కేశవ్‌ (బి) బుమ్రా 8; బవుమా (నాటౌట్‌) 35; డి కాక్‌ (బి) సిరాజ్‌ 21; ముల్డర్‌ (సి) పంత్‌ (బి) షమీ 1; జాన్సెన్‌ (సి) పంత్‌ (బి) షమీ 13; రబడ (సి) షమీ (బి) అశ్విన్‌ 0; ఎన్‌గిడి (సి) పుజారా (బి) అశ్విన్‌ 0;  ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (68 ఓవర్లలో ఆలౌట్‌) 191.  
 

వికెట్ల పతనం: 1–1, 2–34, 3–74, 4–94, 5–130, 6–161, 7–164, 8–190, 9–191, 10–191. 
బౌలింగ్‌: బుమ్రా 19–4–50–3, షమీ 17–3–63–3, సిరాజ్‌ 18–5–47–2, శార్దుల్‌ 5–0–11–0, అశ్విన్‌ 9–2–18–2.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top