బాబర్‌ ఆజం ప్రపంచ రికార్డు.. సరికొత్త చరిత్ర | Babar Azam Breaks Faf Du Plessis World Record Becomes 1st Player With The Most Centuries As A Captain In T20 Cricket | Sakshi
Sakshi News home page

బాబర్‌ ఆజం ప్రపంచ రికార్డు.. సరికొత్త చరిత్ర

Apr 29 2026 11:27 AM | Updated on Apr 29 2026 12:36 PM

Babar Azam Breaks Faf Du Plessis World Record Becomes 1st Player To

పాకిస్తాన్‌ స్టార్‌ బ్యాటర్‌ బాబర్‌ ఆజం సరికొత్త చరిత్ర సృష్టించాడు. టీ20 క్రికెట్‌లో ఇంత వరకు ఏ ఆటగాడికీ సాధ్యం కాని అరుదైన ఘనత సాధించాడు. కాగా గత కొంతకాలంగా ఫామ్‌లేమితో విమర్శల పాలైన బాబర్‌.. ప్రస్తుతం పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ (PSL)తో బిజీగా ఉన్నాడు.

బాబర్‌ ఆజం శతకం
పెషావర్‌ జల్మీ జట్టుకు కెప్టెన్‌గా ఉన్న బాబర్‌ (Babar Azam).. ఇటీవలే ఫామ్‌లోకి వచ్చాడు. తాజాగా ఇస్లామాబాద్‌ యునైటెడ్‌తో జరిగిన క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో అతడు అదరగొట్టాడు. కరాచీ వేదికగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చిన బాబర్‌ ఆజం శతక్కొట్టాడు. ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌ మొత్తంగా 59 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 103 పరుగులు సాధించాడు.

151 పరుగులకే ఆలౌట్‌
బాబర్‌ ఇన్నింగ్స్‌ కారణంగా పెషావర్‌ జల్మీ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 221 పరుగులు సాధించింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఇస్లామాబాద్‌ యునైటెడ్‌ 151 పరుగులకే ఆలౌట్‌ అయింది. 

ఫైనల్‌కు పెషావర్‌
ఫలితంగా 70 పరుగుల భారీ తేడాతో గెలుపొందిన పెషావర్‌ జల్మీ ఫైనల్‌కు దూసుకువెళ్లింది. ఈ మ్యాచ్‌లో పెషావర్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజంకు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది.

కాగా పీఎస్‌ఎల్‌ తాజా సీజన్‌లో బాబర్‌ ఆజంకు ఇది రెండో సెంచరీ. ఈ క్రమంలోనే అతడు సౌతాఫ్రికా వెటరన్‌ స్టార్‌ ఫాఫ్‌ డుప్లెసిస్‌ పేరిట ఉన్న ప్రపంచ రికార్డు బద్దలు కొట్టాడు. టీ20 క్రికెట్‌లో కెప్టెన్‌ హోదాలో అత్యధిక సెంచరీలు సాధించిన క్రికెటర్‌గా బాబర్‌ ఆజం చరిత్ర సృష్టించాడు.

టీ20 క్రికెట్‌లో కెప్టెన్‌ హోదాలో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాళ్లు
👉బాబర్‌ ఆజం (పాకిస్తాన్‌)- తొమ్మిది సెంచరీలు
👉ఫాఫ్‌ డుప్లెసిస్‌ (సౌతాఫ్రికా)- ఎనిమిది సెంచరీలు
👉మైకేల్‌ క్లింగెర్‌ (ఆస్ట్రేలియా)- ఏడు సెంచరీలు
👉విరాట్‌ కోహ్లి (భారత్‌)- ఐదు సెంచరీలు
👉జేమ్స్‌ విన్స్‌ (ఇంగ్లండ్‌)- ఐదు సెంచరీలు.

చదవండి: అదే మా కొంపముంచింది.. అతడు మాత్రం అద్భుతం: శ్రేయస్‌

Advertisement
 
Advertisement
Advertisement