కోహీర్ పీఠంపై కౌన్!!
మ్యాజిక్ ఫిగర్‌కు ఒకస్థానందూరంలో కాంగ్రెస్ స్వతంత్రులు, ఎంఐఎం మద్దతు ఇచ్చే అవకాశం!
జహీరాబాద్: కోహీర్ మున్సిపల్ చైర్మన్ ఎంపిక లాంఛనమే అయినట్లు సమాచారం. సోమవారం నిర్వహించనున్న చైర్మన్, వైస్ చైర్మన్ పదవుల ఎన్నికకు దాదాపుగా అభ్యర్థిత్వాలు ఖరారవగా అధికారిక ప్రకటనే మిగిలినట్లు తెలుస్తోంది. చైర్మన్ పదవి ఎస్సీ జనరల్ కేటగిరీలో రిజర్వు అయింది. మున్సిపాలిటీలో 16 వార్డులకుగాను 8 వార్డులను కాంగ్రెస్, 5 వార్డులను బీఆర్‌ఎస్‌లు గెలుచుకున్నాయి. ఒక్కోస్థానంలో బీజేపీ, ఎంఐఎం, స్వతంత్రులు దక్కించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్‌కు ఒకస్థానం దూరంలో ఉంది. దీంతో స్వతంత్ర అభ్యర్థి ఇప్పటికే కాంగ్రెస్ శిబిరంలో ఉన్నట్లు, ఎంఐఎం కూడా మద్దతిచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చైర్మన్ పదవి కోసం కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన అశోక్, శిరీషలు ఆశిస్తూ వచ్చారు. ఎన్నికకు ముందు అభ్యర్థిని ప్రకటించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. కొత్తగా ఏర్పాటైన కోహీర్ పురపీఠాన్ని ఎవరు అధిరోహించనున్నారనేది ఆసక్తికరంగా మారింది.


