లేబర్ కోడ్‌లు రద్దు చేయాల్సిందే
● సమ్మెలో కార్మిక సంఘాల డిమాండ్
● సిద్దిపేటలో భారీ ర్యాలీ
సిద్దిపేటకమాన్: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లను వెంటనే రద్దు చేయాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ ఆధ్వర్యంలో సిద్దిపేట పట్టణంలో గురువారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యుత్ రంగంలో తీసుకువస్తున్న నూతన విద్యుత్ చట్టాన్ని, ఉపాధి హామీ చట్టాన్ని రద్దుచేసి దాని స్థానంలో తెస్తున్న వీబీ జీ రాంజీ చట్టాన్ని రద్దు చేయాలని, విత్తన సవరణ బిల్లు, ఎల్‌ఐసీలో వంద శాతం విదేశీ పెట్టుబడులను వెంటనే వెనక్కి తీసుకోవాలన్నారు. విరోచితంగా పోరాడి ప్రాణత్యాగాలతో సాధించుకున్న 29కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్‌లను తెచ్చిందన్నారు. వీటిని కేంద్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి గోపాలస్వామి, హెచ్‌ఎంఎస్ జాతీయ నాయకుడు సదుర్శన్‌రావు, బీఆర్‌టీయూ రాష్ట్ర నాయకుడు నారాయణ, ఏఐటీయుసి జిల్లా కార్యదర్శి లక్ష్మణ్, సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్, సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లారెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి శశిధర్, సీఐటీయూ జిల్లా ఉపాద్యక్షురాలు పద్మ తదితరులు పాల్గొన్నారు.


